ఎల్లుండి.. న్యూజిలాండ్ లో టీమిండియా మొదటి టీ20: టైమింగ్స్, లైవ్ టెలికాస్ట్ డీటెయిల్స్
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కు సర్వం సిద్ధమైంది. 22వ తేదీన గురువారం మొదటి మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ క్రైస్ట్ చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ స్టేడియం తొలి మ్యాచ్‌కు వేదిక. ఈ సుదీర్ఘ పర్యటన కోసం శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు న్యూజిలాండ్ లో అడుగు పెట్టింది కూడా. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, జట్టు ప్లేయర్లు క్రైస్ట్ చర్చ్ చేరుకున్నారు.
ఈ టీ20 సిరీస్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ వంటి కీలక ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం లభిస్తుందా లేదా అనేది చర్చనీయాంశమైంది. ఇటీవల స్వదేశంలో వెస్టిండీస్‌పై అద్భుత ఇన్నింగ్స్‌లతో అలరించిన సంజూ శాంసన్, న్యూజిలాండ్ గడ్డపై కూడా అదే రకమైన ఆధిపత్యాన్ని చెలాయించాలని భావిస్తున్నాడు. అతను రాణిస్తే వైభవ్ సూర్యవంశీకి తుదిజట్టులో అవకాశం ఉండదు. బెంచ్ కే పరిమితం కావాల్సి ఉంటుంది.

ఈ అయిదు టీ20 మ్యాచ్ లు కూడా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఆరంభమౌతాయి. ఈ సిరీస్ ప్రత్యక్ష ప్రసార హక్కులను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ దక్కించుకుంది. బుల్లితెరపై సోనీ స్పోర్ట్స్ ఛానళ్ల ద్వారా ఈ మ్యాచ్ లను లైవ్ టెలికాస్ట్ చూడొచ్చు. మొబైల్ లో చూడాలనుకుంటే సోనీ లివ్ యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీటిని వీక్షించవచ్చు. భారత్ తరఫున రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, హర్షా భోగ్లే వంటి దిగ్గజాలు కామెంటేటర్స్ గా వ్యవహరించనున్నారు.
న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా భారత జట్టు అయిదు టీ20ల అనంతరం అయిదు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లను కూడా ఆడుతుంది. ఈ టీ20 సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లు క్రైస్ట్ చర్చ్ వేదికగానే జరుగనున్నాయి. మూడో మ్యాచ్ వెల్లింగ్టన్ ఎన్ వై ఆర్ స్టేడియంలో ఉంటుంది. నాలుగో మ్యాచ్ ఆక్లాండ్ ఈడెన్ పార్క్, చివరి మ్యాచ్ హ్యామిల్టన్ సెడాన్ పార్క్ లో జరగనున్నాయి. న్యూజిలాండ్ కాలమానం ప్రకారం మ్యాచ్‌లు రాత్రి 8 గంటలకు మొదలవుతాయి.
ఈ సిరీస్ కోసం ఎంపికైన భారత జట్టులో.. శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, శివం దూబే, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు.
న్యూజిలాండ్ జట్టులో.. మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, జోష్ క్లార్క్ సన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, బెవాన్ జాకబ్స్, కైల్ జెమిసన్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫెర్ట్, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్ ఉన్నారు.













Click it and Unblock the Notifications
