IND vs NZ: న్యూజిలాండ్‌కు బిగ్ షాక్.. సిరీస్ మొత్తానికి స్టార్ బౌలర్ దూరం!
IND vs NZ: ఇండియాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో ఇప్పటికే వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న న్యూజిలాండ్ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది. నాలుగో టీ20 మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆ జట్టు స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ పిక్క గాయం కారణంగా మిగిలిన సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. హ్యాగ్లీ ఓవల్‌లో జరిగిన రెండో టీ20 సందర్భంగా లాకీ ఫెర్గూసన్ కుడి కాలి పిక్క కండరాల గాయానికి గురయ్యాడని, స్కాన్ రిపోర్టులో గాయమైనట్లు నిర్ధారణ అయిందని న్యూజిలాండ్ క్రికెట్ వర్గాలు తెలిపాయి. లాకీ ఫెర్గూసన్ కోలుకోవడానికి మరో వారం రోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఫెర్గూసన్ స్థానంలో మ్యాట్ ఫిషర్‌ను జట్టులోకి రీప్లేస్‌మెంట్‌గా సెలెక్ట్ చేశారు.
కష్టాల్లో కివీస్ బౌలింగ్ విభాగం
ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా బ్యాటర్ల విధ్వంసాన్ని అడ్డుకోవడంలో న్యూజిలాండ్ బౌలర్లు తీవ్రంగా విఫలం అవుతున్న తరుణంలో ఫెర్గూసన్ దూరం కావడం కివీస్‌కు కోలుకోలేని దెబ్బే. ఇప్పటికే ఆడిన 3 మ్యాచ్‌ల్లోనూ భారత్ ఘన విజయం సాధించి 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో 225 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా సునాయాసంగా ఛేదించగా.. రెండో టీ20లో 180 పరుగులను అలవోకగా ఛేదించింది. ఇక మూడో టీ20లోనైతే న్యూజిలాండ్ నిర్దేశించిన 199 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 13.2 ఓవర్లలోనే పూర్తి చేసి ఆతిథ్య జట్టు బౌలింగ్ విభాగాన్ని ఊచకోత కోసింది. న్యూజిలాండ్ పేసర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటున్నా.. స్పిన్నర్లు మిచెల్ శాంట్నర్, మైకేల్ బ్రేస్‌వెల్ మాత్రమే కొంతవరకు కట్టడి చేయగలుగుతున్నారు.

మ్యాట్ హెన్రీ, జేమీసన్ అప్‌డేట్
రెండో టీ20 సమయంలోనే కుడి తొడ కండరాల నొప్పితో బాధపడిన మరో స్టార్ పేసర్ మ్యాట్ హెన్రీకి కూడా వైద్య పరీక్షలు నిర్వహించగా.. చిన్నపాటి టియర్ ఉన్నట్లు తెలిసింది. మ్యాట్ హెన్రీ కోలుకోవడానికి 1 నుంచి 2 వారాల సమయం పడుతుందని అంచనా. నవంబరులో ప్రారంభమయ్యే వన్డే సిరీస్ నాటికి మ్యాట్ హెన్రీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ కింద విశ్రాంతి తీసుకుంటున్న కైల్ జేమీసన్ కాంటర్బరీ తరఫున శనివారం ఫోర్డ్ ట్రోఫీ మ్యాచ్ ఆడనున్నాడు. అనంతరం వన్డే సిరీస్ కోసం సోమవారం జాతీయ జట్టుతో కలవనున్నాడు.
శుక్రవారం నాలుగో టీ20
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ ఇప్పటికే చేజిక్కించుకున్నప్పటికీ.. శుక్రవారం ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా నాలుగో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడైపోగా.. విజయ పరంపరను కొనసాగించాలని టీమిండియా పట్టుదలతో ఉంది. మరోవైపు కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి తమ సత్తా చాటాలని ఆతిథ్య న్యూజిలాండ్ ఆశిస్తోంది.














Click it and Unblock the Notifications
