World Cup 2023: సెమీస్ లో కివీస్ తో అదే జరిగితే - ఫైనల్స్ కు ఇండియా ఖాయం..!!
ప్రపంచ కప్ సమరం అసలు పోరు మొదలైంది. సెమీస్ లో ఇండియా వర్సస్ కివీస్ పోటీ దాదాపు ఖాయమైంది. పాకిస్థాన్ తన చివరి మ్యాచ్ లో ఇంగ్లాండ్ పైన అనూహ్య విజయం సాధిస్తేనే సెమీస్ కు చేరే అవకాశం కనిపిస్తోంది. అయితే, అవకాశాలు లేవనే చెప్పాలి. ఈ సమయంలో కివీస్ వర్సస్ భారత్ పోరుతో 2019 ప్రపంచ కప్ సెమీస్ అందరూ గుర్తు చేసుకుంటున్నారు. అదే తరహాలో ఇప్పుడు వర్షం పడితే.. ఈ మ్యాచ్ లో గెలుపు దక్కేదెవరికి. ఫైనల్ చేరేదెవరు.
సెమీస్ పై ఉత్కంఠ: ప్రపంచ కప్ సెమీస్ తో తొలి సెమీస్ లో భారత్ వర్సస్ న్యూజీలాండ్ మధ్య ఉత్కంఠ పోరు జరగనుంది. రెండో సెమీస్ మేటి జట్లుగా కనిపిస్తున్న సౌతాఫ్రిక్ వర్సస్ ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఈ నాలుగు జట్లలో రెండు టీంలు ఫైనల్ పోరులో ఈ నెల 19న అహ్మదాబాద్ లో తలపడనున్నాయి. భారత్ 1983, 2011 తరువాత ఇప్పుడు టైటిల్ ఫేవరెట్ గా కనిపిస్తోంది.

ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్ ల్లో అన్నింటా విజయం సాధించి టాప్ లో నిలిచింది. కానీ, 2019 సెమీస్ లో న్యూజీలాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయింది. గెలుపు ఖాయమని భావించిన మ్యాచ్ లో ఓడిన టీమిండియా..ఇప్పుడు సొంత గడ్డపైన కివీస్ పై ప్రతీకారానికి సిద్దం అవుతోంది. 2019 సెమీస్ లో గెలిచిన న్యూజీలాండ్ ను ఫైనల్స్ లో బ్యాడ్ లక్ వెంటాడింది.
రెండు జట్ల హోరా హోరీ: 2019 సెమీస్ లో న్యూజీలాండ్ ఇచ్చిన 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన భారత్ 49.3 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌటై ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. న్యూజిలాండ్ ప్రపంచ కప్ క్రికెట్‌లో ఫైనల్ చేరడం అది రెండోసారి. గత ప్రపంచ కప్ లోనూ న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరి అక్కడ ఓటమి పాలైంది.
ఇప్పుడు మూడోసారి సెమీస్ ఖాయం చేసుకుంటున్న కివీస్ భారత్ పైన ఆడనుంది, కివీస్ అంతకు ముందు 1975, 79, 92, 99, 2007, 2011 ప్రపంచకప్‌లలో సెమీఫైనల్ వరకు వచ్చినా ఫైనల్‌కు చేరలేకపోయింది. ఇక, ఇప్పుడు భారత్ - కివీస్ మధ్య జరిగే సెమీస్ కు వర్షం ముప్పు ఉందనే హెచ్చరికలు కనిపిస్తున్నాయి. 2019 లో సెమీస్ లోనూ వర్షం కారణంగా రెండో రోజు రిజర్వ్ డే కూడా ఆట కొనసాగింది. దీంతో, ఇప్పుడు ఏం జరుగుతుందనేది ఉత్కంఠ పెంచుతోంది.
వర్షంతో రద్దయితే..ఫైనల్ కు: ప్రపంచ కప్ నిబంధనల మేరకు సెమీస్, ఫైనల్ మ్యాచ్ కు రిజర్వ్ డే లు నిర్ణయించారు. ఒక వేళ అంచనా వేస్తన్నట్లుగా భారత్ - న్యూజీలాండ్ మ్యాచ్ కు వర్షం కురిసి మ్యాచ్ జరగని పరిస్థితి వస్తే రిజర్వ్ డే నాడు నిర్వహిస్తారు. నిబంధనల ప్రకారం కనీస ఓవర్లు రెండు జట్లు ఆడాల్సి ఉంటుంది. అప్పటికీ సాధ్యం కాకుంటే రెండు జట్ల మధ్య ఇదే టోర్నీలో గతంలో జరిగిన మ్యాచ్ లో విన్నర్.. రెండు జట్ల రన్ రేట్ పరిగణలోకి తీసుకుంటారు.
ఈ రెండు విషయాల్లోనూ కివీస్ పైన భారత్ విజయం సాధించి ఉంది. అదే విధంగా రన్ రేట్ లో న్యూజీలాండ్ కంటే అధిక రన్ రేట్ భారత్ సొంతం చేసుకుంది. దీంతో, వర్షం ముప్పు ఎదురైతే రోహిత్ సేన ప్రపంచ కప్ గ్రాండ్ ఫైనల్స్ లోకి అడుగు పెట్టటం ఖాయం. అయితే, ఇరు జట్లు సమతూకం..అన్ని రంగాల్లోనూ పటిష్ఠంగా కనిపిస్తున్న ఈ రెండు జట్ల మధ్య సెమీస్ జరిగాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications