కింగ్ కోహ్లీకి గాడ్ గిఫ్ట్
Virat Kohli: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ దూకుడు కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌లల్లో జయభేరి మోగించింది. రెండు మ్యాచ్‌లు- రెండు విజయాలతో నాలుగు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. గ్రూప్ ఏలో రెండో స్థానంలో నిలిచింది. సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఈ గ్రూప్‌లో ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్.. రేసు నుంచి తప్పుకొన్నాయి.
ఫిబ్రవరి 20వ తేదీన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది భారత్. ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్దేశించిన 228 పరుగులను 46.3 ఓవర్లలో కొట్టిఅవతల పడేసింది. శుభ్‌మన్ గిల్ నూటొక్క పరుగులతో చెలరేగిన గేమ్ అది.

ఆ తరువాత తన మలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌కు చుక్కలు చూపించింది టీమిండియా. ఇక్కడా ఆరు వికెట్ల తేడాతోనే జయకేతనాన్ని ఎగురవేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్దేశించిన 241 పరుగులను 42.3 ఓవర్లలోనే ఊదేసింది. టీమిండియా బ్యాటింగ్ మెషీన్ విరాట్ కోహ్లీ సెంచరీతో కదం తొక్కాడీ మ్యాచ్‌లో.
ఇక తన తదుపరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఢీ కొట్టబోతోంది రోహిత్ సేన. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మధ్యాహ్నం 2:30 గంటలకు గేమ్ మొదలవుతుంది. ఇప్పటికే ఈ రెండు జట్లూ కూడా సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. బంగ్లాదేశ్‌పై గెలిచిన తరువాత గ్రూప్ ఏలో అగ్రస్థానానికి ఎగబాకింది న్యూజిలాండ్.
గ్రూప్ ఏలో తొలి రెండు అగ్ర జట్ల మధ్య మ్యాచ్ కావడం వల్ల దీనిపై అందరి దృష్టీ నిలిచింది. లీగ్ దశలో భారత్-న్యూజిలాండ్ ఆడబోయే చివరి మ్యాచ్ ఇదే. దీన్నీ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి ఈ రెండు జట్లు కూడా. ఈ గేమ్‌తోనే లీగ్ దశ కూడా ముగుస్తుంది. మంగళవారం అంటే మార్చి 4వ తేదీన తొలి సెమీ ఫైనల్ జరుగుతుంది.
ఇది- విరాట్ కోహ్లీకి మరపురాని మ్యాచ్‌గా నిలిచిపోనుంది. అతని కేరీర్‌లో 300 మ్యాచ్. వన్డేల్లో ఇప్పటివరకు 299 మ్యాచ్‌లు ఆడాడీ టీమిండియా బ్యాటింగ్ మెషీన్. 58.2 సగటుతో 14,085 పరుగులు చేశాడు. 51 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలు ఇందులో ఉన్నాయి. అత్యద్బుతమైన స్ట్రైక్ రేట్‌ను కొనసాగిస్తోన్నాడు. 93.42 స్ట్రైక్ రేట్‌తో స్కోర్ బోర్డ్‌ను పరుగులు పెట్టిస్తోన్నాడు.
తొలి వన్డేను ఎలాంటి దూకుడుగా ఆడాడో.. ఇప్పటికీ దాన్నే కంటిన్యూ చేస్తోన్నాడు. అదే ఎనర్జీ, స్పార్క్ ఇప్పటికీ అతనిలో కనిపిస్తోంది. అతని ఫిట్‌నెస్.. గాడ్ గిఫ్ట్‌గా చెప్పుకోవచ్చు. ఈ 300 మ్యాచ్‌లో అతను సెంచరీ చేయాలని కోరుకుంటోన్నారు అభిమానులు.












Click it and Unblock the Notifications