పాకిస్తాన్ చేతిలో మనోళ్లు అంత ఘోరంగా ఓడిపోవుడేందీ?: పగ తీర్చుకునే ఛాన్సొచ్చింది మరి
Champions Trophy 2025 Prize Money: ప్రతిష్ఠాత్మకమైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు గడువు సమీపిస్తోంది. ఈ నెల 19వ తేదీన ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానుంది. మార్చి 9వ తేదీ వరకు కొనసాగుతుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య దేశం పాకిస్తాన్‌ను తలపడనుంది న్యూజిలాండ్. మార్చి 9వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.
భారత్ సహా ఎనిమిది దేశాలు- పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు ఇందులో తలపడనున్నాయి. భారత్ ఆడబోయే మ్యాచ్‌లన్నీ కూడా తటస్థ వేదిక దుబాయ్‌లో జరుగనున్నాయి. మిగిలినవి- కరాచీ, లాహోర్, రావల్పిండిల్లో షెడ్యూల్ అయ్యాయి.

గ్రూప్-ఏలో భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్తాన్.. గ్రూప్ బీలో ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఇప్పటికే అన్ని దేశాల బోర్డులు కూడా తమ జట్లను ప్రకటించాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోయే భారత జట్టును బీసీసీఐ ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే.
ఈ ట్రోఫీలో భాగంగా భారత్- పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్‌పైనే అందరి దృష్టీ నిలిచింది. ఇంకో వారం రోజులే. సరిగ్గా వచ్చే ఆదివారం ఈ రెండు జట్ల మధ్య ఈ హైఓల్టేజ్ గేమ్ ఆరంభమౌతుంది. దుబాయ్ దీనికి వేదిక. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా గత ఏడాది జూన్ 9వ తేదీన ఈ రెండు జట్లూ తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో ఆరు పరుగుల తేడాతో విజయకేతనాన్ని ఎగురవేసింది టీమిండియా.
ఆ తరువాత ఈ రెండు జట్లూ ఢీ కొట్టబోతోండటం ఇదే మొదటిసారి. ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం భారత్‌పై పాకిస్తాన్‌దే పైచేయి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2017 నాటి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో భారత్‌ను ఓడించిందా జట్టు. లండన్ కెన్నింగ్టన్ ఓవల్‌లో జూన్ 18వ తేదీన జరిగిన ఆ మ్యాచ్‌లో 180 పరుగుల తేడాతో పరాజయాన్ని చవి చూసింది టీమిండియా.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్.. నిర్ణీత 50 ఓవర్లల్లో నాలుగు వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. ఫకర్ జమాన్ సెంచరీతో చెలరేగాడు. 114 పరుగులు చేశాడు. ఓపెనర్ అజర్ అలీ- 59, బాబర్ ఆజమ్- 46, మహ్మద హఫీజ్- 57 పరుగులు చేయడంతో ఆ జట్టు 338 పరుగులు చేయగలిగింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 158 పరుగులకే ఆలౌట్ అయింది. లోయర్ ఆర్డర్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఒక్కడే టాప్ స్కోరర్. పాక్ బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొని 76 పరుగులు చేశాడు. శిఖర్ ధవన్- 21, యువరాజ్ సింగ్- 22, రవీంద్ర జడేజా- 15 తప్ప మరెవరూ డబుల్ డిజిట్ స్కోర్ కూడా చేయలేకపోయారు. ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications