సమవుజ్జీతో భీకరపోరు: టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే: శివం దుబే అవుట్?
IND vs SA: ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్ కప్ 2024లో భారత్ దండయాత్ర తుదిదశకు చేరుకుంది. ఫైనల్‌లో తన సమవుజ్జీ దక్షిణాఫ్రికాను ఢీకొట్టబోతోంది. ఈ మ్యాచ్.. రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది. బార్బడొస్ రాజధాని బ్రిడ్జిటౌన్ కెన్నింగ్‌స్టన్ ఓవల్ స్టేడియం దీనికి వేదిక. ఈ టోర్నమెంట్‌లో ఓటమి అనేదే తెలియని జట్లు ఈ రెండూ.
గుయానాలో జరిగిన రెండో సెమీ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది భారత్. 68 పరుగుల తేడాతో జయకేతనాన్ని ఎగురవేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని డిపార్ట్‌మెంట్‌లల్లో టీమిండియా ప్లేయర్లు వారియర్స్‌ను గుర్తుకు తెచ్చారు. ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. తొలి సెమీ ఫైనల్స్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించి ఫైనల్స్‌లో ఎంట్రీ ఇచ్చింది దక్షిణాఫ్రికా.

అంతకుముందు- లీగ్స్‌లో గానీ, సూపర్ 8లో గానీ ఒక్క మ్యాచ్‌లో కూడా ఓటమి చవి చూడలేదు. ఆడిన అన్నింట్లోనూ విజయదుందుభి మోగించాయి. 2014 తరువాత తొలిసారిగా టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్‌కు చేరింది భారత్. బంగ్లాదేశ్ ఢాకాలో జరిగిన అప్పటి ఫైనల్స్‌లో శ్రీలంక చేతిలో ఓడింది. ఇప్పుడు మళ్లీ ఛాంపియన్‌గా నిలిచే అవకాశానికి చేరువ అయింది.
టీ20 వరల్డ్ కప్ ఆరంభంలో బోణీ కొట్టిన తరువాత ఇప్పటివరకు మళ్లీ కప్‌ను అందుకునే ఛాన్స్ భారత్‌కు రాలేదు. ఇప్పుడు గెలిస్తే రెండోసారి కప్‌ను ముద్దాడినట్టవుతుంది. టీ20 వరల్డ్ కప్‌ను రెండుసార్లు జయించిన జట్టు వెస్టిండీస్ ఒక్కటే. 2012, 2016ల్లో విండీస్ వీరులు విజేతగా నిలిచారు.
దక్షిణాఫ్రికా పరిస్థితి దీనికి పూర్తి భిన్నం. తొలిసారిగా ఫైనల్స్ చేరింది. ఐసీసీ నిర్వహించే ఏ టోర్నమెంట్‌ను తీసుకున్నా ఫైనల్స్ వరకూ రావడం ప్రొటీస్‌కు ఇదే తొలిసారి. ఒకరకంగా వారికి ఇది తొలి బిగ్గెస్ట్ ఫైనల్ మ్యాచ్. ఇందులో గెలిచితీరాలనే తపన వారిలో కనిపిస్తోంది. ఈ టోర్నమెంట్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోవడం వారి సన్నద్ధకు అద్దంపడుతోంది.
టీమిండియా తుది జట్టులో పెద్దగా మార్పులు చేర్పులు ఉండకపోవచ్చు గానీ.. ఫామ్‌లో లేని శివం దుబేను పక్కనపెట్టే అవకాశాలు లేకపోలేదు. అతని స్థానంలో సంజు శాంసన్ లేదా యశస్వి జైస్వాల్‌ను తీసుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో ఓట్నెల్ బార్ట్‌మన్‌కు తుదిజట్టులో చోటు దక్కొచ్చు.
భారత తుదిజట్టులో.. రోహిత్ శర్మ (కేప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే/సంజు శాంసన్/యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా ఆడే అవకాశాలు ఉన్నాయి.
దక్షిణాఫ్రికా తుదిజట్టులో.. క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్‌రమ్ (కేప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్‌సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, ఎన్రిచ్ నార్ట్జే, తబ్రేజ్ శాంసీ/ఒట్నీల్ బార్ట్‌మన్ ఆడొచ్చు.












Click it and Unblock the Notifications