సీనియర్లు లేకపోయినా పర్లేదు: వారితో నెట్టుకొచ్చిన గౌతమ్ గంభీర్
IND vs SL 2nd T20I: టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత జట్టు హవా కంటిన్యూ అవుతోంది. ఈ ఫార్మట్‌లో వరల్డ్ కప్ గెలిచిన తరువాత ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లల్లో ఓడింది ఒక్కదాంటోనే. ఏడింట్లో తిరుగులేని విజయాలను అందుకుంది. రెండు సిరీస్‌లను కైవసం చేసుకుంది.
టీ20 వరల్డ్ కప్ 2024 ముగిసిన తరువాత జింబాబ్వేలో పర్యటించింది టీమిండియా. అక్కడ విజయకేతనాన్ని ఎగురవేసింది. అయిదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో గెలుచుకుంది. తొలి మ్యాచ్‌లో ఓడిన తరువాత వరుసగా నాలుగింట్లో విజయఢంకా మోగించింది. అదే దూకుడును శ్రీలంకలో కొనసాగిస్తోంది.

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0 తేడాతో వశం చేసుకుంది. ఇంకో మ్యాచ్ మిగిలివుండగానే.. ఈ ఘనత సాధించింది. ఆదివారం రాత్రి శ్రీలంక పల్లెకెలె స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్‌లో ఆ దేశ జట్టును ఏడు వికెట్ల తేడాతో మట్టికరిపించింది. వర్షం వల్ల ఆటంకం కలిగిన ఈ మ్యాచ్‌ను డక్ వర్త్ విధానంలో నెగ్గింది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. పాథుమ్ నిశ్శంక- 32, కుశాల్ మెండీస్- 10, కుశాల్ పెరీరా- 53, కమందు మెండిస్- 26, చరిత్ అసలంక- 14, రమేష్ మెండిస్- 12 పరుగులు చేశారుు. టీమిండియా బౌలర్లల్లో రవి బిష్ణోయ్ మూడు వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా రెండేసి చొప్పున వికెట్లు తీసుకున్నారు.
ఛేజింగ్‌కు దిగిన టీమిండియా ప్రారంభంలోనే ఓపెనర్ సంజు శాంసన్ వికెట్ కోల్పోయింది. తీక్షణ బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్- 30, కేప్టెన్ సూర్యకుమార్ యాదవ్- 26, హార్దిక్ పాండ్యా- 22 (నాటౌట్) రాణించారు.
భారత్.. 6.3 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసిన దశలో వర్షం పడింది. ఆ తరువాత మ్యాచ్‌ను కొనసాగించడానికి వీలు పడలేదు. దీనితో డక్ వర్త్ లూయిస్ విధానంలో టీమిండియాను విజేతగా ప్రకటించారు. దీనితో మూడు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకుంది.
హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ సాధించిన తొలి సిరీస్ ఇది. రెగ్యులర్ హెడ్ కోచ్‌గా అపాయింట్ అయిన తరువాత ఎదుర్కొన్న తొలి సిరీస్‌లోనే విజయాన్ని అందుకున్నాడీ మాజీ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, జస్‌ప్రీత్ బుమ్రా వంటి సీనియర్లు లేకుండా.. ఐపీఎల్ స్టార్లతోనే జట్టుకు విజయాన్ని అందించాడు.












Click it and Unblock the Notifications