టీమిండియా టాస్ గెలిచినా ఒక్క బంతి కూడా పడకుండానే..!!
భారత్- న్యూజిలాండ్ మధ్య హ్యామిల్టన్ వేదికగా నేడు జరగాల్సిన మూడో వన్డే రద్దయింది. వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే కాల్డ్ ఆఫ్ అయింది. హ్యామిల్టన్ ను ఎంతకీ వీడని వాన వల్ల అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తోన్నట్లు ప్రకటించారు. దీంతో అయిదు వన్డేల సిరీస్‌లో భారత జట్టు తన 2-0 ఆధిక్యాన్ని పదిలపరుచుకుంది. సిరీస్ ఓడిపోని స్థితికి చేరుకుంది. చివరి రెండు మ్యాచ్ లో ఓడిపోయినా గానీ సిరీస్ 2-2 తో సమం అవుతుంది.
భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉంది. అంతకుముందు కొన్ని గంటల నుంచే హామిల్టన్ లో భారీ వర్షం పడటం మొదలైంది. మ్యాచ్ ఆరంభం అయ్యే సమయానికీ వదల్లేదు. దీంతో టాస్ ఆలస్యమైంది. మధ్యలో కొంత తెరిపినివ్వడంతో అంపైర్లు గ్రౌండ్ ను పరిశీలించారు. పలు దఫాలుగా టాస్ సమయాన్ని మార్చారు. ఉదయం 8:30- 9 గంటలకు మధ్య వర్షం కొంత తెరిపినిచ్చింది.

దీంతో 9 గంటలకు టాస్ వేయనున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మ్యాచ్ ను 40 ఓవర్లకు కుదించారు. 9: 30 కు మ్యాచ్ మొదలు కావాల్సి ఉంది. సరిగ్గా 9 గంటలకు టాస్ పడింది. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సిరీస్‌లో గిల్ వరుసగా టాస్ గెలవడం ఇది మూడోసారి. న్యూజిలాండ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గత రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన తుది జట్టునే కొనసాగించింది. తుదిజట్టులో మార్పులు చేర్పులు చేయలేదు.
టాస్ ప్రక్రియ ముగిసిన వెంటనే వాతావరణం ప్రతికూలంగా మారింది. మళ్లీ వర్షం ప్రారంభమైంది. దీంతో నిర్ణీత సమయానికి ప్రారంభం కాలేదు. మధ్యలో కొంతసేపు వాన తగ్గడంతో గ్రౌండ్ స్టాఫ్ పిచ్‌పై కవర్లను తొలగించారు. ఆటగాళ్లు కూడా మైదానంలోకి దిగడానికి సిద్ధమౌతున్న తరుణంలో మళ్లీ భారీ వర్షం విరుచుకుపడింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఫలితం తేలాలంటే కనీసం 20 ఓవర్ల మ్యాచ్ నిర్వహించాల్సి ఉంటుంది.
ఉదయం 10:30 గంటల వరకు అవకాశం ఉండేది. వర్షం ఎంతకీ తగ్గకపోవడం, గ్రౌండ్ లో నీరు నిలిచిపోవడం, అవుట్ ఫీల్డ్ అంతా కూడా చిత్తడిగా మారడం వల్ల మ్యాచ్ నిర్వహించడం సాధ్యం కాలేదు. దీంతో మ్యాచ్‌ను రద్దు చేస్తోన్నట్లు అధికారికంగా వెల్లడించారు. మూడో వన్డే వర్షార్పణం కావడం వల్ల సిరీస్‌లో పుంజుకోవాలనుకున్న న్యూజిలాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మిగిలిన రెండింట్లో ఒక్కటి గెలిచినా, రద్దయినా ఈ సిరీస్ టీమిండియా సొంతమవుతుంది.
హ్యామిల్టన్ మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగియడంతో భారత్, న్యూజిలాండ్ జట్లు తదుపరి మ్యాచ్ కోసం తౌరంగాకు బయలుదేరి వెళ్లనున్నాయి. నాలుగో వన్డే.. ఈ నెల 13న శుక్రవారం రోజున తౌరంగా బే ఓవల్ స్టేడియంలో జరగనుంది. ఇక చివరిదైన ఐదో వన్డే కూడా 15వ తేదీ ఆదివారం రోజున అదే స్టేడియంలో జరగాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లలో విజయమే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి.














Click it and Unblock the Notifications
