వైట్ వాష్ పై కన్నేసిన టీమిండియా: విన్నింగ్ కాంబినేషన్ లో మార్పులు?
న్యూజిలాండ్తో జరుగుతున్న అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా ఇప్పటికే పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది. 3-0 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇంకా రెండు మ్యాచ్ లు మిగిలివుండగానే సిరీస్ భారత్ వశమైంది. నేడు నాలుగో మ్యాచ్ జరుగనుంది. భారత కాలమానం ప్రకారం.. ఈ మధ్యాహ్నం 12:30 గంటలకు ఆరంభమౌతుందిది. అక్లాండ్ లోని ఈడెన్ పార్క్ స్టేడియం దీనికి వేదిక. ఈ సిరీస్ విజయాన్ని ఇక్కడా కొనసాగించాలనే పట్టుదలతో ఉంది టీమిండియా. వైట్ వాష్ పై కన్నేసింది.
ఈ మ్యాచ్కు వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అందుబాటులోకి వచ్చాడు. తొడ కండరాల నొప్పి బారిన పడ్డ అతను చివరి రెండు మ్యాచ్ లల్లో ఆడలేదు. పూర్తి ఫిట్నెస్ సాధించడంతో ఈ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. ఇషాన్ రాకతో వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం దక్కకపోవచ్చు. రెండో మ్యాచ్ లో విఫలమైన అతను.. మూడో గేమ్ లో మాత్రం అంద్భుతంగా పుంజుకొన్నాడు. అభిషేక్ శర్మతో కలిసి మెరుపులు మెరిపించాడు. 44 పరుగులు చేశాడు.

నేటి మ్యాచ్ లో అతనికి తుదిజట్టులో చోటు దక్కుతుందా, లేదా అనేది చర్చనీయాంశమైంది. ఇప్పటికే సిరీస్ గెలిచినందున మిగిలిన రెండు మ్యాచ్ లు కూడా నామమాత్రమే అయ్యాయి. దీంతో ప్రయోగాలు చేసే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటివరకు ఈ సిరీస్ లో మ్యాచ్ లు ఆడే అవకాశం దక్కని ప్లేయర్లకు తుదిజట్టులో చోటు కల్పించడాన్నీ పరిశీలిస్తోంది టీమిండియా మేనేజ్మెంట్. ఇటే మొగ్గు చూపితే.. వైభవ్ సూర్యవంశీ, శివమ్ దుబేలను తీసుకోవచ్చు. విన్నింగ్ కాంబినేషన్ లో ఎంతవరకు మార్పులు చేయడానికి మనేజ్మెంట్ మొగ్గు చూపుతుందనే విషయంపై ఇది ఆధారపడి ఉంది.
మరోవైపు ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. నాలుగేళ్ల విరామం తర్వాత టీ20 జట్టులోకి పునరాగమనం చేసిన అతను మొదటి రెండు మ్యాచ్లలో కలిపి 99 పరుగులు సమర్పించుకున్నాడు. మూడో మ్యాచ్ లో కూడా ఏ మాత్రం రాణించలేదు. 4 ఓవర్లల్లో 40 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడు. అతనికి ప్రత్యామ్నాయంగా మయాంక్ యాదవ్ అందుబాటులో ఉన్నప్పటికీ.. భువనేశ్వర్ కుమార్ కు మరో అవకాశం ఇవ్వొచ్చు.
టీమిండియా తుదిజట్టులో.. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ప్రిన్స్ యాదవ్, అర్ష్దీప్ సింగ్ కు చోటు దక్కే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications
