టీమిండియా మళ్లీ ఫ్లాప్ షో
న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా మౌంట్ మాంగనుయ్ స్టేడియంలో జరుగుతున్న అయిదో వన్డేలో భారత బ్యాటింగ్ మరోసారి ఫ్లాప్ షో ఇచ్చింది. నిరాశపరిచింది. న్యూజిలాండ్ బౌలింగ్ దాడికి టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఒకరిద్దరు బ్యాటర్లు మినహా మిగిలిన వారెవరూ చెప్పుకోదగ్గ స్కోర్ కూడా చేయకపోవడంతో భారత్ 42.1 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ అయింది. అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ బాధ్యతాయుత ఆటతీరుతో జట్టు కనీస గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది.
అయిదు మ్యాచ్ ఈ సిరీస్ లో భారత్ 2-1 తేడాతో ఆధిక్యతో నిలిచింది. ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ కైవసం చేసుకోగలుగుతుంది. ఓడితే 2-2 తో సమం అవుతుంది. ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ ఏడు పరుగులకే అవుట్ అయ్యాడు. మ్యాథ్యూ ఫిషర్ బౌలింగ్‌లో నిష్క్రమించాడు. ఆ తర్వాత వచ్చిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా నిరాశపరిచాడు. అయిదు పరుగులే చేశాడు.

రుతురాజ్ గైక్వాడ్- 18, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్- 22.. కొంత ప్రతిఘటించినప్పటికీ భారీ ఇన్నింగ్ నిర్మించడంలో విఫలం అయ్యారు. 86 పరుగులకే టాప్ ఆర్డర్ కుప్పకూలింది. నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ దశలో లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ బాధ్యతాయుతంగా ఆడారు. వీరిద్దరూ అయిదో వికెట్‌కు 46 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.
అక్షర్ పటేల్ 55 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 46, ఇషాన్ కిషన్ 58 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేశారు. వీరిద్దరి పోరాటం వల్ల భారత్ గౌరవప్రదమైన స్థానానికి చేరుకోగలిగింది. చివర్లో బౌలర్లు కూడా తమ బ్యాట్‌కు పని చెప్పారు. మహమ్మద్ సిరాజ్ 14 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, చివరి బ్యాటర్ గా దిగిన అర్ష్‌దీప్ సింగ్ 4 బంతుల్లోనే 2 భారీ సిక్సర్లతో 14 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు మెరుపు ముగింపు ఇచ్చాడు. దీనితో భారత జట్టు స్కోరు 200 మార్కును దాటింది.
న్యూజిలాండ్ బౌలర్ల ముందు అర్ష్ దీప్ ఎక్కువ సేపు నిల్చోలేకపోయాడు. దీంతో టీమిండియా ఇన్నింగ్స్ 42.1 ఓవర్లలో 209 పరుగుల వద్ద ముగిసింది. న్యూజిలాండ్ బౌలింగ్ విభాగంలో కెప్టెన్ మిఛెల్ శాంట్నర్, పేస్ బౌలర్ జేకబ్ డఫీ చెరో 3 వికెట్లు పడగొట్టి భారత ఇన్నింగ్స్‌ను దెబ్బతీశారు. మ్యాథ్యూ ఫిషర్- 2 వికెట్లు తీసి టాప్ ఆర్డర్‌ను దెబ్బతీయగా, బ్లేర్ టిక్నర్, మైఖేల్ బ్రేస్‌వెల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. 210 పరుగుల లక్ష్యం అంత పెద్దదేమీ కాకపోయినా, ప్రారంభ ఓవర్లలోనే న్యూజిలాండ్ ఓపెనర్లను ఔట్ చేసి ఒత్తిడిలోకి నెడితేనే భారత్‌కు విజయావకాశాలు ఉంటాయి.












Click it and Unblock the Notifications
