India vs Pakistan: భారత్-పాక్ మ్యాచ్ కష్టమే-కొలంబోలో భారీవర్షం-రేపటికి వాయిదా ?
భారత ఉపఖండంలో వర్షాల సీజన్ అని తెలిసీ ఆసియాకప్ 2023 టోర్నీ ప్లాన్ చేసిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు మ్యాచ్ ల నిర్వహణ సవాలుగా మారింది. ఇప్పటికే వర్షం కారణంగా ఆసియా కప్ లీగ్ దశలో పలు మ్యాచ్ లు వర్షార్పణం కావడమో లేక ఫలితాలు తారుమారు కావడమో జరిగిపోగా.. ఇవాళ కొలంబోలో జరగాల్సిన భారత్-పాకిస్తాన్ సూపర్ 4 మ్యాచ్ కూ వర్షం ముప్పు కనిపిస్తోంది. ఇప్పటికే కొలంలోబో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇవాళ ఈ మ్యాచ్ జరగడం కష్టంగా మారబోతోంది.
ఆసియాకప్ 2023 లీగ్ దశలోనే శ్రీలంకలోని పల్లెకెలెలో జరిగిన భారత్-పాక్ మ్యాచ్ అర్ధాంతరంగా వర్షార్పణం అయింది. అలాగే భారత్-నేపాల్ మ్యాచ్ కూడా వర్షార్పణం అయింది. ఇప్పుడు భారత్-పాక్ జట్ల మధ్య ఇవాళ మధ్యాహ్నం మొదలుకావాల్సిన సూపర్ 4 మ్యాచ్ ను కూడా వర్షం వెంటాడుతోంది. ఇప్పటికే శ్రీలంక వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండగా.. రాజధాని కొలంబోలోనూ ఇదే పరిస్ధితి ఉంది. అయితే నిన్న వర్షం కాస్త తెరిపినివ్వడంతో శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్ ఫలితం తేలింది.

ఇవాళ జరగాల్సిన భారత్-పాక్ సూపర్ 4 మ్యాచ్ కు 90 శాతం వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ విభాగం ప్రకటించింది. దీంతో ఇరు జట్లతో పాటు అభిమానులు కూడా ఇవాళ మ్యాచ్ జరుగుతుందని భావించడం లేదు. అయితే రిజర్వ్ డే ఉండటంతో రేపు ఈ మ్యాచ్ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇవాళ మ్యాచ్ ప్రారంభానికి వర్షం ఆటంకాలు కల్పించబోతోంది. ఆ తర్వాత మ్యాచ్ ప్రారంభమైనా తిరిగి ఆటంకాలు తప్పేలా లేవు. దీంతో భారత్-పాక్ మ్యాచ్ చూద్దామని ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ తప్పేలా లేదు.
ఆసియాకప్ లో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య గరిష్టంగా మూడు మ్యాచ్ లు జరిగే అవకాశం ఉందని అభిమానులు భావించారు. ఇందులో లీగ్ మ్యాచ్ ఒకటి కాగా.. సూపర్ 4 మ్యాచ్ మరొకటి. ఇరుజట్లూ ఫైనల్ కు చేరితే ఫైనల్ మ్యాచ్ కూడా ఉంటుందని అనుకుంటున్నారు. అయితే లీగ్ దశలో మ్యాచ్ వర్షార్పణం అయింది. ఇవాళ మ్యాచ్ కూ వర్షం ముప్పు తప్పేలా లేదు. రేపు కూడా గ్యారంటీ ఏమీ లేదు. దీంతో ఆసియాకప్ మ్యాచ్ ల నిర్వహణపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications