ఫైనల్ లో వీపు విమానం మోతేరా మీకు
Aisa Cup 2025 final: ఊహించినట్టే.. ఆసియా కప్ 2025 ఫైనల్స్ లో పాకిస్తాన్ అడుగు పెట్టింది. భారత్ ను ఢీకొట్టబోతోంది. ఈ నెల 28వ తేదీన ఈ మ్యాచ్. ఆసియా కప్ టైటిల్ కోసం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. ఈ టోర్నమెంట్ లో భారత్- పాకిస్తాన్ ఎదురెదురు పడటం ఇది మూడోసారి. లీగ్స్, సూపర్ 4 దశలో టీమిండియాదే పైచేయి.
గురువారం రాత్రి దుబాయ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను 11 పరుగుల తేడాతో మట్టికరిపించింది పాకిస్తాన్. ఎటువంటి ఈక్వేషన్లతో పని లేకుండా నేరుగా ఫైనల్స్ లో అడుగు పెట్టింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 135 పరుగులే చేసినప్పటికీ.. ఆ తర్వాత బౌలింగ్ లో దుమ్ము దులిపింది. బంగ్లాదేశ్ ను 124 పరుగుల వద్దే కట్టడి చేసింది.

పాకిస్తాన్ ఇన్నింగ్ లో వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ హ్యారిస్ దే టాప్ స్కోర్. 23 బంతుల్లో 31 పరుగులు కొట్టాడు. ఇందులో ఓ సిక్సర్, రెండు ఫోర్లు ఉన్నాయి. అతను తప్ప మరే బ్యాటర్ కూడా రాణించలేకపోయాడు. ఓపెనర్లు షాహిబ్ జాదా ఫర్హాన్- 4, ఫఖర్ జమాన్- 13, సయీం అయూబ్- 0, కేప్టెన్ సల్మాన్ ఆఘా- 19, హసన్ తలట్- 3, షహీన్ షా అఫ్రిది- 19, మహ్మద్ నవాజ్- 25, ఫహీమ్ అష్రాఫ్- 14, హ్యారిస్ రవూఫ్- 3 పరుగులు చేశారు.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్.. చేతులెత్తేసింది. పాకిస్తాన్ బౌలర్ల ముందు మోకరిల్లింది. ఓపెనర్లు సైఫ్ హసన్- 18, పర్వెజ్ హొస్సైన్ ఎమాన్- 0, తౌహీద్- 5, మెహదీ హసన్- 11, నూరుల్ హసన్- 16, షమీమ్ హొస్సైన్- 5, తన్జిమ్ హసన్ సకీబ్- 10, రషీద్ హొస్సైన్- 16, తస్కిన్ అహ్మద్-4, ముస్తాఫిజుర్ రెహ్మాన్- 6 పరుగులు చేశారు.
పాక్ బౌలర్లల్లో షహీన్ షా అఫ్రిది అదరగొట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు నేలకూల్చాడు. మూడు వికెట్లతో సత్తా చాటాడు హ్యారిస్ రవూఫ్. సయీ అయూబ్- 2, మహ్మద్ నవాజ్ ఒక వికెట్ తీసుకున్నారు. భారత్ తో ఫైనల్స్ కు ముందు జరిగిన ఈ గేమ్ లో పాకిస్తాన్ బ్యాటింగ్ ఘోరంగా విఫలమైనప్పటికీ.. బౌలర్లు రాణించడం ఆ జట్టుకు ఊరట ఇచ్చింది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్ ల రిజల్ట్ చూస్తే.. ఫైనల్స్ లో కూడా టీమిండియా ఏకపక్షంగా గెలవడానికి అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications