వైజాగ్ వన్డే: జైస్వాల్ ఊచకోత-సౌతాఫ్రికాపై టీమిండియా ఘన విజయం..!!
విశాఖపట్నం వేదికగా ఇండియా దక్షిణాఫ్రికా మధ్య జరిగిన చివరిదైన మూడవ వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది. దీంతో 2-1తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ వన్డే కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేయడంతో టీమిండియా ఆడుతూ పాడుతూ విజయతీరాలకు చేరింది. రోహిత్ శర్మ చక్కటి షాట్లతో ఫ్యాన్స్‌ను అలరించాడు.
వరుసగా టాస్ ఓడిపోతూ వస్తున్న టీమిండియాకు విశాఖ కలిసొచ్చింది. ఈ సారి టాస్ గెలిచిన కెప్టెన్ కేఎల్ రాహుల్ సౌతాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లలో క్వింటాన్ డీకాక్ సెంచరీతో కదం తొక్కగా కెప్టెన్ టెంబా బవుమా 48 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఇక మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.

ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఓపెనర్ రియాన్ రికెల్టన్ అర్ష్‌దీప్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను చక్కబెట్టే బాధ్యత డీకాక్ -బావుమా జోడీ భుజాన వేసుకుంది. ఈక్రమంలోనే డీకాక్ సెంచరీ చేశాడు. భారత బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ వేసిన తొలి రెండు ఓవర్లలో ప్రోటీస్ పరుగుల వర్షం కురిపించారు. 47.5 ఓవర్లలో 270 పరుగులు చేసి సౌతాఫ్రికా ఆలౌట్ అయ్యింది.భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ప్రసిద్ధ్ కృష్ణలు చెరో 4 వికెట్లు తీయగా..అర్షదీప్ జడేజాలు తలో వికెట్ పడగొట్టారు.
271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. జైస్వాల్ సెంచరీ, రోహిత్ శర్మ విరాట్ కోహ్లీల అర్థ సెంచరీలతో టార్గెట్‌ను ఈజీగా రీచ్ అయ్యింది. రోహిత్ శర్మ 75 పరుగులు చేసి ఇన్నింగ్స్‌లో కీలకపాత్ర పోషించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో బ్రెట్జ్‌కీ ఒక వికెట్ పడగొట్టాడు. ఇక చివర్లో విరాట్ కోహ్లీ 45 బంతుల్లో 65 పరుగులు చేసి కదం తొక్కడంతో మరో 10 ఓవర్లు మిగిలి ఉండగానే భారత్ విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ యశస్వీ జైస్వాల్ ఎంపిక అవగా... ప్లేయర్ ఆఫ్ ది సిరస్‌గా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఎంపికయ్యాడు. ఈ మూడు వన్డేల్లో విరాట్ రెండు సెంచరీలు ఒక అర్థ సెంచరీ చేశాడు. ఇక ఈ విక్టరీతో 9వ తేదీన ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌కు కాన్ఫిడెన్స్‌తో టీమిండియా బరిలోకి దిగుతుంది.












Click it and Unblock the Notifications