మతం పేరుతో ప్రాణాలు తీస్తారా..?
జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు సృష్టించిన మారణ హోమాన్ని ప్రపంచమంతా తీవ్రంగా ఖండిస్తోంది. కాశ్మీర్ అందాలను ఆస్వాదించేందుకు వచ్చిన పర్యాటకులపై విరుచుకుపడిన ఉగ్రవాదులు.. 28 మంది ప్రాణాలు తీశారు. చంపే ముందు ఉగ్రవాదులు పర్యాటకుల మతాల గురించి ఆరా తీయడం గమనార్హం. ముస్లిమేతరులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ప్రాణాలు తీశారు ఉగ్రవాదులు.
ఈ దాడిని ప్రపంచ దేశాలతోపాటు ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగ, భారత క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ కూడా ఉగ్రదాడి ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అసలు ఇది ఏ రకమైన యుద్ధం? మనుషుల ప్రాణాలకు విలువన్నదే లేకుండా పోయింది అంటూ సిరాజ్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

'పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన భయంకరమైన దాడి గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. మతం పేరుతో అమాయ ప్రజలను లక్ష్యంగా చేసుకోవడం, వాళ్లను చంపడం అనేది హేయమైన చర్య. ఇలాంటి క్రూరమైన చర్యలను ఏ సిద్ధాంతమూ అంగీకరించదు. ఇది ఏరకమైన యుద్ధం? మనుషుల ప్రాణాలకు ఎలాంటి విలువ లేకుండా పోతోంది. పహల్గామ్ దాడిలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాల్లో నిండిన విషాదం.. వాళ్లు పడుతున్న బాధను నేను ఊహించలేకపోతున్నాను' అని ఎక్స్ వేదికగా సిరాజ్ తన ఆవేదన వ్యక్తం చేశారు.
ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రతా బలగాలు
జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో మారణ హోమానికి పాల్పడిన ఉగ్రవాదుల వేట కొనసాగిస్తున్నాయి భారత భద్రతా బలగాలు. కుల్గాంలోని టంగ్‌మార్క్‌లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య భీకర ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. పహల్గాం మారణ హోమానికి కారణమైన టీఆర్ఎఫ్ ఉగ్రవాదుల కమాండర్ ఆసిఫ్ ఫౌజీని భద్రత బలగాలు ట్రాప్ చేశాయి.
ఉగ్రవాదులు తలదాచుకున్న ప్రాంతాన్ని అన్ని వైపుల నుంచ బలగాలు చుట్టుముట్టాయి. కాగా, ఈ దాడుల్లో టీఆర్ఎఫ్ ఉగ్రవాదుల కమాండర్ అసిఫ్ ఫౌజీ నేరుగా పాల్గొన్నట్లు సమాచారం. ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు భద్రతా బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలిసింది.
Just read about the horrific and shocking terrorist attack in Pahalgam.
— Mohammed Siraj (@mdsirajofficial) April 23, 2025
To target and kill innocent civilians in the name of religion is pure evil...
No cause, no belief, no ideology can ever justify such a monstrous act.Yeh kaisi ladai hai... pic.twitter.com/nP5LKpT94E
భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదుల్ని భారత సైన్యం మట్టుబెట్టిన కొద్ది గంటలకే టంగ్ మార్క్ ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకోవడం గమనార్హం. మంగళవారం నాటి పహల్గాం దాడి ఘటనకు పాల్పడింది తామేనంటూ 'రి రిసెస్టెన్స్ ఫ్రంట్' ప్రకటించుకున్న విషయం తెలిసిందే. మరోవైపు, బుధవారం తెల్లవారుజామున ఇద్దరు ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు యత్నిస్తుండగా.. వారిని సైన్యం మట్టుబెట్టింది. ఎన్‌కౌంటర్ అనంతరం ఉగ్రవాదుల నుంచి భారీ మందుగుండు సామాగ్రి, ఆయుధాలు, పాకిస్థాన్ కరెన్సీ భద్రతా బలగాలు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. ఇది ఇలావుండగా, ఉగ్రదాడికి సంబంధించి 1400 మంది అనుమానితులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి.












Click it and Unblock the Notifications