పాకిస్తాన్ తో ఫైనల్- గాయపడ్డ ఇద్దరు టీమిండియా స్టార్ బ్యాటర్లు
Aisa Cup 2025 final: ఊహించినట్టే.. ఆసియా కప్ 2025 ఫైనల్స్ లో పాకిస్తాన్ అడుగు పెట్టింది. భారత్ ను ఢీకొట్టబోతోంది. ఈ నెల 28వ తేదీన ఈ మ్యాచ్. ఆసియా కప్ టైటిల్ కోసం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. ఈ టోర్నమెంట్ లో భారత్- పాకిస్తాన్ ఎదురెదురు పడటం ఇది మూడోసారి. లీగ్స్, సూపర్ 4 దశలో టీమిండియాదే పైచేయి.
ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడేందుకు సన్నద్ధమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా గాయలు కలకలం రేపుతోంది. శ్రీలంకతో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో ఇద్దరు కీలక ఆటగాళ్లకు గాయాలవడం జట్టులో ఆందోళన నెలకొంది. శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, బ్యాటర్ అభిషేక్ శర్మ కండరాల నొప్పితో మైదానం వీడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని భారత బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ ధృవీకరించారు కూడా. వారిద్దరూ కండరాల నొప్పితో బాధపడుతున్నట్లు తెలిపారు.

శ్రీలంకతో మ్యాచ్‌లో కండరాల నొప్పితో హార్దిక్ పాండ్యా ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత అతను బంతిని అందుకోలేదు. తాత్కాలికంగా గ్రౌండ్ ను వీడాడు. ఇది టీమ్ మేనేజ్‌మెంట్‌ను కలవరపరుస్తోంది. మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మోర్నె మోర్కెల్ మాట్లాడారు. ఈ విషయాన్ని ధృవీకరించారు. మార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ కండరాల నొప్పితో బాధపడ్డారని తెలిపాడు. హార్దిక్ ఆరోగ్యాన్ని పరిశీలించిన తర్వాతే.. ఫైనల్ లో ఆడటంపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అభిషేక్ శర్మ కోలుకున్నాడని చెప్పారు.
నేడు వాళ్లిద్దరూ నెట్ సెషన్స్ కు హాజరు కాలేకపోవచ్చని భావిస్తోన్నట్లు మోర్నె మోర్కెల్ చెప్పారు. నెట్ ప్రాక్టీస్ కంటే కూడా ప్లేయర్ల రికవరీ ముఖ్యమని, మ్యాచ్ తర్వాత రికవరీ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. వారికి పూల్ సెషన్, మసాజ్‌లు ఏర్పాటు చేస్తామని వ్యాఖ్యానించారు మోర్కెల్. ఫైనల్ మ్యాచ్ నాటికి రికవరీ అవుతారనే నమ్మకం ఉందని, ఈ గేమ్ కోసం మానసికంగా సిద్ధం కావాల్సి ఉందని అన్నారు.
అటు గాయాలతో పాటు, భారత బౌలింగ్ ప్రదర్శన కూడా ఆందోళన కలిగిస్తోంది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో అర్ష్‌దీప్ సింగ్ తన నాలుగు ఓవర్ల కోటా ఒక వికెట్ మాత్రమే తీసుకుని ఏకంగా 46 పరుగులు ఇచ్చుకున్నాడు. అటు హర్షిత్ రాణాది కూడా ఇదే పరిస్థితి. మూడు ఓవర్లకే 44 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఏడు ఓవర్లలో 90 పరుగులు సమర్పించుకోవడం ఆందోళనకరంగా మారింది. పాకిస్తాన్‌ను కట్టడి చేయాలంటే, భారత బౌలర్లు కీలకమైన ఆరంభ వికెట్లను తీయాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications