సూపర్ ఓవరా.. మజాకా: కొత్త రూల్‌తో మస్త్ మజా: ఎన్నయినా ఆడొచ్చు
IPL 2025 Super Over: ఇంకొన్ని గంటలే. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ 18వ ఎడిషన్ సమీపించింది. ఈ సాయంత్రం తొలి మ్యాచ్ జరుగనుంది. 2024లో ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న కోల్‌కత నైట్‌రైడర్స్ టీమ్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీ కొట్టబోతోంది. నైట్‌రైడర్స్ హోమ్ పిచ్ ఈడెన్ గార్డెన్స్ దీనికి వేదిక.
2008 నాటి తొలి సీజన్ తరువాత ఈ రెండు జట్లు తొలి మ్యాచ్‌లో ఎదురుపడటం ఇదే తొలిసారి. మే 20వ తేదీన తొలి క్వాలిఫయర్ ఉంటుంది. 21వ తేదీన ఎలిమినేటర్, 23వ తేదీన రెండో క్వాలిఫయర్ షెడ్యూల్ అయ్యాయి. ఇక 25వ తేదీన ఫైనల్స్ మ్యాచ్ జరుగుతుంది. క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్‌కు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది.

ఐపీఎల్ 2025లో సూపర్ ఓవర్ నిబంధనల్లో తాజాగా పలు సవరణలు చేసింది బీసీసీఐ. ఈ మేరకు ఫ్రాంచైజీల కేప్టెన్లకు సమాచారం ఇచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం- మ్యాచ్ టై అయితే ఫలితం తేల్చడానికి రెండు జట్లకు ఒక గంట సమయం ఉంటుంది. ఈ గంట వ్యవధిలో ఫలితం వచ్చే వరకు ఎన్ని సూపర్ ఓవర్లయినా ఆడించవచ్చు.
ప్రధాన మ్యాచ్ ముగిసిన గంటలోపు విజేతను నిర్ణయించే వరకు ఎన్ని సూపర్ ఓవర్లయినా ఆడవచ్చు. మొదటి సూపర్ ఓవర్ ప్రధాన మ్యాచ్ ముగిసిన 10 నిమిషాల్లో ప్రారంభం కావాలి. మొదటి సూపర్ ఓవర్ టై అయితే, ఆ తరువాతి సూపర్ ఓవర్.. అయిదు నిమిషాల్లోనే ప్రారంభం కావాల్సి ఉంటుంది.
ఒక సూపర్ ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోతే ఆ జట్టు ఇన్నింగ్ ముగిసినట్టే. టై అయితే- విజేతను నిర్ణయించే వరకు తదుపరి సూపర్ ఓవర్లు ఆడతారు. తరువాతి సూపర్ ఓవర్‌లో- రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు మొదట బ్యాటింగ్ చేస్తుంది. మొదటి సూపర్ ఓవర్, అంతకుముందు సూపర్ ఓవర్‌లో బౌలింగ్ చేసిన బౌలర్ ఆ తరువాత బౌలింగ్ చేయడానికి అనర్హుడు.
అంటే ఒక బౌలర్.. ఒక సూపర్ ఓవర్‌లో మాత్రమే బౌలింగ్ చేయడానికి అర్హుడు. అలాగే- మొదటి సూపర్ ఓవర్‌లో అవుట్ అయిన బ్యాటర్ ఆ తరువాతి సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్ చేయడానికి అనర్హుడు. అంటే ఒక బ్యాటర్ ఒక సూపర్ ఓవర్‌లో మాత్రమే బ్యాటింగ్ చేయగలుగుతాడు.
ఒకవేళ- సూపర్ ఓవర్ లేదా ఆ తరువాత గంట వ్యవధిలో ఆడే సూపర్ ఓవర్లు పూర్తి కాకుండా మ్యాచ్ రద్దయితే టైగా ప్రకటించి పాయింట్లను పంచుతారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే, సూపర్ ఓవర్‌ను మ్యాచ్ జరిగిన రోజునే ఐపీఎల్ మ్యాచ్ రిఫరీ నిర్ణయించిన సమయంలో దాన్ని మళ్లీ నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications