నో ముంబై, నో దుబాయ్: ఐపీఎల్ 2025పై కీ అప్‌డేట్
IPL 2025 auction venue: వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్‌లో భారీగా మార్పులు చేర్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. రాబోయే సీజన్ మొత్తం కొత్త కొత్తగా కనిపించబోతోంది. ఈ మెగా టోర్నమెంట్ ఆడే 10 ఫ్రాంఛైజీల యాజమాన్యాలు పూర్తిస్థాయిలో ప్రక్షాళనకు దిగాయి.
ఈ దఫా జరిగే మెగా వేలం పాట సందర్భంగా దాదాపుగా కొత్త ముఖాలకు చోటు కల్పించవచ్చు. ఈ దిశగా ఇప్పటికే కొన్ని మార్పులు సైతం చోటు చేసుకున్నాయి. కోల్‌కత నైట్ రైడర్స్ కూడా కొత్త మెంటార్ వచ్చాడు. ఈ టీమ్ మెంటార్ కమ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్.. జాతీయ జట్టుకు హెడ్ కోచ్‌గా అపాయింట్ కావడం వల్ల ఈ స్థానం ఖాళీ అయింది. ఆయన స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ బౌలర్, వెస్టిండీస్‌కు చెందిన డ్వేన్ బ్రావో అపాయింట్ అయ్యాడు.

గుజరాత్ టైటాన్స్‌లోనూ ఇదే తరహా మార్పులు జరగొచ్చంటూ వార్తలొచ్చినప్పటికీ- అది వాస్తవ రూపం దాల్చలేదు. హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రాకు ఉద్వాసన పలకాలని గుజరాత్ టైటాన్స్ మొదట్లో నిర్ణయించుకున్నప్పటికీ తరువాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఆశీష్ నెహ్రాను కొనసాగించబోతోంది.
లక్నో సూపర్ జెయింట్స్ కేప్టెన్ కేఎల్ రాహుల్.. తన సొంత రాష్ట్రానికి వస్తాడనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఐపీఎల్ 2025 సీజన్ కోసం అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చేరొచ్చనీ అంటున్నారు. ఇలాంటి అనేక మార్పులు- నెక్స్ట్ సీజన్ కోసం నిర్వహించే వేలంపాటలో చూడొచ్చు.
ఈ మెగా ఆక్షన్‌ను నిర్వహించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ మరోసారి విదేశాల వైపే మొగ్గు చూపింది. ఈ దఫా సౌదీ అరేబియాలో దీన్ని ఏర్పాటు చేయడం దాదాపుగా ఖాయమైనట్టే. రియాద్ లేదా జెడ్డా పేర్లను పరిశీలనలోకి తీసుకుంది. నవంబర్ చివరి వారంలో ఇది షెడ్యూల్ కావొచ్చు.
బ్రిటన్‌లో మెగా ఆక్షన్ నిర్వహించాలని బీసీసీఐ తొలుత భావించింది. నవంబర్ చివరి వారంలో అక్కడ మంచు విపరీతంగా కురవడం, ఉష్ణోగ్రత క్షీణించడం, చలిగాలుల తీవ్రత వల్ల మానుకుంది. దీనికి బదులుగా రియాద్ లేదా జెడ్డాలో వేలం పాటను నిర్వహించేలా కసరత్తు చేపట్టింది.












Click it and Unblock the Notifications