IPL 2026: కొంపముంచిన రింకూ సింగ్.. చిత్తుగా ఓడిన కేకేఆర్
ఐపీఎల్ 2026 సీజన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) ఓటమితో ముగించింది. కోల్‌కతా వేదికగా ఆదివారం జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)ను చిత్తు చేసింది.
మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ముంబై ఇండియన్స్‌ను ఓడించడంతో ఈ మ్యాచ్‌కు విలువ లేకుండా పోయింది. 16 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.
రాణించిన రాహుల్..
ఈ నామమాత్రపు మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగుల భారీ స్కోర్ చేసింది. కేఎల్ రాహుల్(30 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 60) హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ అక్షర్ పటేల్(25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39), డేవిడ్ మిల్లర్(19 బంతుల్లో 3 సిక్స్‌లతో 28) కీలక ఇన్నింగ్స్ ఆడారు. కేకేఆర్ బౌలర్లలో సౌరభ్ దూబే(2/28) రెండు వికెట్లు తీయగా.. అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ పడగొట్టారు.

నిప్పులు చెరిగిన కుల్దీప్, ఎంగిడి..
అనంతరం కేకేఆర్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ అజింక్యా రహానే(39 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. రోవ్‌మన్ పోవెల్(21 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 29) కాస్త పోరాడినా ఫలితం లేకపోయింది. రింకూ సింగ్(0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో లుంగి ఎంగిడి (3/27), కుల్దీప్ యాదవ్(3/29) మూడేసి వికెట్లతో.. మిచెల్ స్టార్క్(2/26) రెండు వికెట్లతో కేకేఆర్ పతనాన్ని శాసించారు. అక్షర్ పటేల్‌కు ఒక వికెట్ దక్కింది.
కొంపముంచిన రింకూ సింగ్..
204 పరుగుల భారీ లక్ష్యఛేదనలో కేకేఆర్‌కు మెరుగైన ఆరంభమే లభించింది. దూకుడుగా ఆడే క్రమంలో ఫిన్ అలెన్(13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 20) వెనుదిరిగినా.. అజింక్యా రహానే హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కానీ వరుస ఓవర్లలో మనీష్ పాండే, కామెరూన్ గ్రీన్, అజింక్యా రహానే వికెట్లను కేకేఆర్ కోల్పోయింది.
ఈ పరిస్థితుల్లో బాధ్యతాయుతంగా ఆడాల్సిన రింకూ సింగ్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. హాఫ్ సెంచరీ హీరో అజింక్యా రహానే, రింకూ సింగ్‌లు వరుస బంతుల్లో ఔటవ్వడంతో కేకేఆర్ తీవ్ర ఒత్తిడికి లోనైంది. రింకూ బాధ్యతాయుతంగా ఆడి ఉంటే ఫలితం మరోలా ఉండేది.
పాపం పంజాబ్..
ఈ ఓటమితో కేకేఆర్ ఈ సీజన్‌లో 7వ స్థానంతో సరిపెట్టుకుంది. 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, ఒక మ్యాచ్ రద్దుతో 13 పాయింట్స్‌కే పరిమితమైంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ 14 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో ఆరో స్థానంలో నిలిచింది. పంజాబ్ కింగ్స్ 14 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, ఒక మ్యాచ్ రద్దుతో 15 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి తృటిలో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను కోల్పోయింది. ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ వరుసగా టాప్-4లో నిలిచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి.














Click it and Unblock the Notifications