IPL 2026: కేకేఆర్ చేతిలో ఘోర పరాజయం.. SRH ప్లే ఆఫ్స్ చేరాలంటే?
ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్రకు కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) బ్రేక్ వేసింది. ఆదివారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. ముందుగా బౌలింగ్‌లో సత్తా చాటి.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో దుమ్మురేపింది. దాంతో వరుసగా 5 విజయాల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమిని చవిచూసింది.
కొంపముంచిన బ్యాటింగ్ వైఫల్యం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 19 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌటైంది. ట్రావిస్ హెడ్(28 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఇషాన్ కిషన్(29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42)కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(3/36) మూడు వికెట్లు తీయగా.. సునీల్ నరైన్(2/31), కార్తీక్ త్యాగీ రెండేసి వికెట్లు పడగొట్టారు. వైభవ్ అరోరా, కామెరూన్ గ్రీన్, అనుకుల్ రాయ్ తలో వికెట్ తీసారు. పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయకుండా సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు మూల్యం చెల్లించుకున్నారు. ట్రావిస్ హెడ్ అద్భుతమైన ఆరంభాన్ని అందించినా సద్వినియోగం చేసుకోలేకపోయారు.

కేకేఆర్ అలవోకగా..
166 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ అలవోకగా ఛేదించింది. 18.2 ఓవర్లలో 3 వికెట్లకు 169 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అంగ్‌క్రిష్ రఘువంశీ(47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 59)హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ అజింక్యా రహానే(36 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 43) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో పాట్ కమిన్స్, సాకీబ్ హుస్సేన్, శివాంగ్ కుమార్ తలో వికెట్ తీసారు.
SRH ప్లే ఆఫ్స్ చేరాలంటే..?
ఈ పరాజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వచ్చే నష్టం ఏం లేదు. కేకేఆర్ చేతిలో ఓడినా ఆరెంజ్ ఆర్మీ పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 విజయాలు, 4 ఓటములతో 12 పాయింట్స్ సాధించింది. రన్‌రేట్(0.644) కూడా మెరుగ్గానే ఉంది. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే తమ చివరి 4 మ్యాచ్‌ల్లో కనీసం రెండింటిని మెరుగైన రన్‌రేట్‌తో గెలవాలి.
అప్పుడు 8 విజయాలు, 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తోంది. 3 విజయాలు సాధిస్తే ఏ సమీకరణంతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దక్కించుకుంటుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ చివరి నాలుగు మ్యాచ్‌లను పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, సీఎస్‌కే, ఆర్‌సీబీతో తలపడనుంది. ఇందులో రెండు హోమ్ మ్యాచ్‌లు(పంజాబ్ కింగ్స్, ఆర్‌సీబీ) ఉండటం సన్‌రైజర్స్‌కు కలిసొచ్చే అంశం.












Click it and Unblock the Notifications