టీడీపీ జడ్పీ ఛైర్మన్ కాబోతున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే..! మధ్యలో జనసేన ట్విస్ట్ ..!
ఏపీలో ఫిరాయింపు రాజకీయాలు పలువురు రాజకీయ నేతల కెరీర్ లను ఎప్పుడు ఏ మలుపు తిప్పుతాయో తెలియని పరిస్ధితికి చేరాయి. ఒకప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా రాజకీయాలు నడిపిన వారు.. ఈసారి పరిషత్ ఎన్నికల్లో జడ్పీటీసీలుగా పోటీ చేశారు. ఇందులో కొందరు గెలవగా.. మరికొందరు ఓడిపోయారు. ఇదే కోవలో వైసీపీకి చెందిన ఓ మాజీ మహిళా ఎమ్మెల్యే టీడీపీలోకి ఫిరాయించారు. ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఓడిపోయారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే జడ్పీటీసీగా గెలిచి జడ్పీ చైర్మన్ కాబోతున్నారు. ఆమె పేరు వంతల రాజేశ్వరి (Vanthala Rajeswari).
2014లో రాష్ట్ర విభజన తర్వాత తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వంతల రాజేశ్వరి.. ఆ తర్వాత స్థానిక రాజకీయాలు, టీడీపీ ప్రభుత్వ ఆపరేషన్ ఆకర్ష్ కారణంగా ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. దీంతో ఆమెకు 2019 ఎన్నికల్లో రంపచోడవరం నుంచి టీడీపీ టికెట్ ఇచ్చింది. కానీ జగన్ హవాలో ఆమె ఓడిపోయారు. రాజేశ్వరిపై వైసీపీ అభ్యర్ధి నాగులాపల్లి ధనలక్ష్మి గెలిచారు. తిరిగి 2024లో టీడీపీ టికెట్ ఆశించినా అధిష్టానం మిరియాల శిరీష అనే టీచర్ కు అవకాశం కల్పించింది. దీంతో శిరీష గెలిచి ఎమ్మెల్యే అయ్యారు.

అదే సమయంలో ప్రభుత్వం వచ్చాక కీలక పదవులు ఇస్తామని రాజేశ్వరికి అధిష్టానం నచ్చజెప్పింది. ఇప్పుడు తాజాగా పరిషత్ ఎన్నికల్లో అడ్డతీగల జడ్పీటీసీ స్ధానం నుంచి వంతల రాజేశ్వరి గెలిచారు. దీంతో ఆమె ఆటోమేటిగ్గా పోలవరం జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ రేసులోకి వచ్చారు. ఇక్కడ జడ్పీ ఛైర్ పర్సన్ స్ధానం మహిళలకు రిజర్వ్ కావడం, స్థానికంగా జనసేన నుంచి మహిళలు ఎవరూ జడ్పీటీగా గెలవకపోవడంతో వంతల రాజేశ్వరికి జడ్పీ ఛైర్మన్ అయ్యేందుకు లైన్ క్లియర్ అయింది. త్వరలో ఆమెను జడ్పీ ఛైర్మన్ పీఠం వరించబోతోంది. అలా వైసీపీ నుంచి నేరుగా ఎమ్మెల్యేగా గెలిచిన వంతల రాజేశ్వరి ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత జడ్పీ ఛైర్మన్ పీఠం అధిష్టించబోతున్నారు. కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లాకు తొలి జడ్పీ ఛైర్ పర్సన్ గా ఆమె రికార్డుల్లోకి ఎక్కే అవకాశం ఉంది.














Click it and Unblock the Notifications
