ఐపీఎల్ ఆక్షన్‌లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన టాప్ 5 ప్లేయర్లు వీరే..!!
IPL auction 2024: ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్ మెగా ఆక్షన్.. దుబాయ్ వేదికగా ముగిసింది. 30 మంది విదేశీ ప్లేయర్లు సహా 77 మందిని ఐపీఎల్ ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. తమ జట్టులో కొత్త రక్తాన్ని నింపాయి.
ఈ వేలం పాట తరువాత అన్ని ఫ్రాంఛైజీల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. చాలామంది ప్లేయర్లు అటు ఇటు అయ్యారు. కొత్త ఫ్రాంఛైజీల తరఫున ఆడబోతోన్నారు. ఓ మోస్తరు ప్లేయర్లు భారీ రేటు పలకడం, మరికొందరు స్టార్ ఆటగాళ్లు అన్ సోల్డ్‌గా మిగలడం ఈ దఫా వేలం పాట ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

హయ్యెస్ట్ రేట్ కూడా ఈ వేలం పాటలోనే రికార్డయింది. జట్టును గెలిపించగలడని భావించిన ఆటగాళ్లపై కోట్ల రూపాయలను గుమ్మరించడానికి వెనుకాడలేదు ఫ్రాంఛైజీల ఓనర్లు. అలాంటి వారి కోసం పోటీ పడ్డారు. ఫలితంగా గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ సారి రికార్డు ధర నమోదయింది.
అత్యధిక రేటుకు అమ్ముడుపోయిన తొలి అయిదుమందిలో ఇద్దరు ఆస్ట్రేలియన్లే. పైగా వారిద్దరూ బౌలర్లే కావడం ఆసక్తి కలిగించే అంశం. ఈ అయిదుమందిలో భారత ఆటగాడు ఒక్కడే. మరెవరూ తొలి అయిదు స్థానాలను చేరుకోలేకపోయారు. మిగిలిన ఇద్దరిలో న్యూజిలాండ్, వెస్టిండీస్ క్రికెటర్లు ఉన్నారు.

హయ్యెస్ట్ రేటు పలికిన ప్లేయర్- మిఛెల్ స్టార్క్. ఆస్ట్రేలియాకు చెందిన స్పెషలిస్ట్ బౌలర్. 24 కోట్ల 75 లక్షల రూపాయలకు అతణ్ని జట్టులోకి తీసుకుంది కోల్‌కత నైట్ రైడర్స్. అతన్ని తీసుకోవడానికి ప్రధాన కారణం- గౌతమ్ గంభీర్. స్టార్క్‌ను కొనుగోలు చేయడానికి ఇన్ని కోట్ల రూపాయలను ధారపోయడానికి వెనుకాడలేదాయన.

రెండో స్థానంలో ఆస్ట్రేలియా కేప్టెన్ పాట్ కమ్మిన్స్ నిలిచాడు. 20 కోట్ల 50 లక్షల రూపాయలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని కొనుగోలు చేసింది. ఇటీవలే ముగిసిన ఐసీసీ వరల్డ్ కప్ 2023లో తన దేశ జట్టును ఛాంపియన్ నిలిపిన ఘనత అతనికి ఉంది. ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ కేప్టెన్‌గా కమ్మిన్స్‌ను నియమించే అవకాశాలు ఉన్నాయి.
14 కోట్ల రూపాయలతో మూడో స్థానంలో నిలిచాడు న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాటర్ డారిల్ మిఛెల్. చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని జట్టులోకి తీసుకుంది. ఈ వరల్డ్ కప్‌లో చెలరేగాడు మిఛెల్. 552 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మిడిలార్డర్‌లో అతన్ని వినియోగించుకోవాలని భావిస్తోంది సీఎస్‌కే.
అత్యధిక రేటుకు అమ్ముడుపోయిన క్రికెటర్లల్లో టీమిండియా బౌలర్ హర్షల్ పటేల్ నాలుగో స్థానంలో ఉన్నాడు. 11 కోట్ల 75 లక్షల రూపాయలకు అతన్ని పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. వెస్టిండీస్ ఆల్ రౌండర్ అల్జారీ జోసెఫ్‌ను 11 కోట్ల 50 లక్షలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి తీసుకుంది.












Click it and Unblock the Notifications