ఐపీఎల్ పితామహుడికిడి వీడిన 16 ఏళ్ల గ్రహణం- త్వరలో భారత్ రాక
ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మొట్ట మొదటి ఛైర్మన్ లలిత్ మోదీ త్వరలోనే తిరిగి భారత్ కు రానున్నారు. సుదీర్ఘ కాలంగా వేధిస్తూ వస్తోన్న ఫెమా కేసులో ఆయనకు భారీ ఊరట లభించింది. ఈ నేపథ్యంలో ఆయన భారత్‌కు తిరిగి వచ్చేందుకు మార్గం సుగమమైంది. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఆయన స్వదేశీ గడ్డపై అడుగు పెట్టనున్నారు. ఇన్నేళ్ల తర్వాత తనపై వచ్చిన ఆరోపణలు తప్పని రుజువయ్యాయని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన లండన్ లో నివసిస్తోన్నారు.
లలిత్ మోదీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్మోపిన కేసులను విచారించిన సఫెమా (SAFEMA - స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్) కీలక తీర్పు ఇచ్చింది. 2009లో దక్షిణాఫ్రికాలో జరిగిన ఐపీఎల్ రెండో సీజన్ నిధుల బదిలీకి సంబంధించిన కేసులో ఈడీ విధించిన జరిమానాలు, ఇతర కీలక అభియోగాలను ట్రిబ్యునల్ కొట్టివేసింది. ఈ పరిణామంతో లలిత్ మోదీకి ఉన్న ప్రధాన చట్టపరమైన అడ్డంకులు దాదాపుగా తొలగిపోయాయి.

ట్రిబ్యునల్ ఇచ్చిన ఈ తీర్పుపై లలిత్ మోదీ స్పందించారు. లండన్ నుంచి ఓ వీడియోను విడుదల చేశారు. ఈ తర్పు తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని వ్యాఖ్యానించారు. 16 ఏళ్లుగా నిజాయితీని నిరూపించుకోవడానికి పోరాడుతున్నానని, చివరకు నిజమే గెలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. మీడియాకు, సాధారణ ప్రజలకు తాను మొదటి నుంచి చెబుతున్న మాటలే నేడు నిజమని తేలిపోయాయని వివరించారు. తాను ఎప్పుడూ ఐపీఎల్ శ్రేయస్సు కోసమే పనిచేశానని, లీగ్ అభివృద్ధి తప్ప తనకు మరో స్వార్థం లేదని స్పష్టం చేశారు.
ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో తాను తిరిగి స్వదేశానికి వస్తానని లలిత్ మోదీ వెల్లడించారు. అక్టోబర్ లో తన కుమార్తె ప్రసవించనుందని, మనవడితో కలిసి నూతన జీవితాన్ని ప్రారంభిస్తానని ఆయన తెలిపారు. ఆ కుటుంబ వేడుకల అనంతరం అంతా మంచే జరుగుతుందని, త్వరలోనే స్వదేశంలో అడుగుపెడతానని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
#WATCH | IPL founder and first chairman Lalit Modi to return to India.
— ANI (@ANI) July 22, 2026
He says, "I'm really happy with the verdict yesterday. It's really been a great day. 16 years I have fought and whatever I have been saying to the media and to everybody has finally emerged as the truth. I'm… pic.twitter.com/QTN7VkzuEy
గతంలో చట్టపరమైన ఇబ్బందుల వల్ల దేశం విడిచి లండన్ కు వెళ్లిన లలిత్ మోదీ.. ఇప్పుడు మళ్లీ భారత్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2009లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ రెండో సీజన్‌ను భారత్ నుంచి దక్షిణాఫ్రికాకు తరలించాల్సి వచ్చింది. ఆ సమయంలో ఫెమా ఉల్లంఘించి భారీ మొత్తంలో నిధుల అవకతవకలకు పాల్పడ్డారంటూ లలిత్ మోదీతో పాటు బీసీసీఐ అధికారులపై కూడా ఈడీ తీవ్రమైన అభియోగాలు మోపింది. వీటిని సఫెమా ట్రిబ్యునల్ కొట్టివేసింది.
సుదీర్ఘ కాలంగా లండన్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న లలిత్ మోదీ పునరాగమనం భారత వ్యాపార, క్రీడా రంగాల్లో సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఆయనపై ఉన్న ప్రధానమైన న్యాయపరమైన వివాదం ఒక కొలిక్కి రావడంతో, మోదీ తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పాత అధ్యాయం ముగిసిపోవడంతో తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుందని లలిత్ మోదీ ధీమా వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications