భారత్‌ను ఓడించిన గంటల్లోనే బిగ్ షాక్.. ఐర్లాండ్ కోచ్ సంచలన రాజీనామా!
ప్రపంచ ఛాంపియన్ భారత జట్టును క్లీన్ స్వీప్ చేసిన విజయోత్సవాలను జరుపుకుంటున్న ఐర్లాండ్ క్రికెట్ జట్టుకు గెలిచిన 24 గంటల వ్యవధిలోనే ఓ బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు హెడ్ కోచ్ హెన్రిక్ మలాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని క్రికెట్ ఐర్లాండ్ అధికారికంగా ధ్రువీకరించింది. అయితే ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని.. ఇరు పక్షాల పరస్పర అంగీకారంతో ముందే అనుకున్న వ్యూహాత్మక మార్పులో భాగమేనని క్రికెట్ ఐర్లాండ్ స్పష్టం చేసింది.
దక్షిణాఫ్రికాకు చెందిన 45 ఏళ్ల హెన్రిక్ మలాన్ 2022లో ఐరిష్ జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీకాలంలో చివరి మ్యాచ్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ముగిసింది. ఆదివారం బెల్ఫాస్ట్‌లో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఐర్లాండ్ ఒక్క పరుగు తేడాతో భారత జట్టును ఓడించి.. టీ20 సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. అంతకుముందు జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లోనూ ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. టీమిండియాపై ఐర్లాండ్ జట్టుకు ఇదే తొలి టీ20 సిరీస్ విజయం కావడం విశేషం.

ఇటువంటి చారిత్రాత్మక విజయం సాధించిన మరుసటి రోజే ఐర్లాండ్ కోచ్ హెన్రిక్ మలాన్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిజానికి ఆయన ఒప్పందం 2027 ఆరంభం వరకు ఉంది.. కానీ ఆయన ముందే బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో ఐర్లాండ్ మాజీ వికెట్ కీపర్ గ్యారీ విల్సన్‌ను కొత్త హెడ్ కోచ్‌గా క్రికెట్ ఐర్లాండ్ నియమించింది. ఆగస్టులో ఆఫ్ఙనిస్థాన్ జట్టుతో జరగబోయే 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ద్వారా విల్సన్ కోచ్‌గా తన కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నారు.
తన రాజీనామా నిర్ణయంపై హెన్రిక్ మలాన్ స్పందిస్తూ.. "ఐర్లాండ్ క్రికెట్‌తో గడిపిన సమయం నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన అధ్యాయం. ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్, ఐరిష్ క్రికెట్ కమ్యూనిటీతో కలిసి పనిచేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. మా ఉమ్మడి లక్ష్యాన్ని నమ్మినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ ప్రయాణం నా జ్ఞాపకాలలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని నేను భావించాను" అని హెన్రిక్ మలాన్ పేర్కొన్నారు.
హెన్రిక్ మలాన్ హయాంలో ఐర్లాండ్ క్రికెట్ పలు చారిత్రాత్మక విజయాలను నమోదు చేసింది. 2020 టీ20 ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ వంటి బలమైన జట్టును ఓడించి ఐర్లాండ్ సంచలనం సృష్టించింది. ఆ తర్వాత 2024లో ఆఫ్ఘనిస్తాన్‌పై తన మొదటి టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది. అదే ఏడాది బెల్ఫాస్ట్ లో జింబాబ్వేను ఓడించి సొంత గడ్డపై తొలి టెస్ట్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు టీమిండియాపై లభించిన తొలి టీ20 సిరీస్ విజయంతో హెన్రిక్ మలాన్ కోచింగ్ కెరీర్ ఘనంగా ముగిసింది.












Click it and Unblock the Notifications