ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కు దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ దూరం: గట్టి దెబ్బ
వరల్డ్ టెస్ట ఛాంపియన్ షిప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్ ల హోమ్ టెస్ట్ సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికా జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ ఈ సిరీస్ మొత్తానికీ దూరం అయ్యాడు. కుడి తొడ వెనుక భాగంలో నరం చిట్లడం (గ్రేడ్-3 హ్యామ్‌స్ట్రింగ్ టియర్) వల్ల అతను జట్టుకు అందుబాటులో ఉండట్లేదు. ఈ విషయాన్ని క్రికెట్ సౌత్ ఆఫ్రికా అధికారికంగా వెల్లడించింది. అతనికి ప్రత్యామ్నాయ ప్లేయర్ ను ఇంకా ఎంపిక చేయాల్సి ఉంది.
అతనే.. కగిసొ రబడ. సౌతాఫ్రికన్ స్టార్ పేస్ బౌలర్. గాయం తీవ్రత దృష్ట్యా పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఎనిమిది నుంచి 10 వారాల సమయం పట్టే అవకాశం ఉందని లయన్స్ బౌలింగ్ కోచ్ అలన్ డొనాల్డ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 9న డర్బన్‌లో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్ మొత్తానికి రబడ దూరం అయ్యాడు. అదే నెల 18న రెండో మ్యాచ్, 27న కేప్‌టౌన్‌లో చివరి టెస్ట్ జరగనున్నాయి. అక్టోబర్ నాటికి ఫిట్‌నెస్ సాధించాలని రబడ భావించినప్పటికీ సుదీర్ఘ విశ్రాంతే అవసరమని డాక్టర్లు నిర్ధారించారు.

దక్షిణాఫ్రికా టెస్టు బౌలింగ్ విభాగానికి కర్త, కర్మ, క్రియ.. కగిసొ రబడ. అతను అందుబాటులో లేకపోవడం ఆతిథ్య జట్టుకు కోలుకోలేని దెబ్బ అనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ప్రత్యేకించి.. ఆస్ట్రేలియాపై అతనికి తిరుగులేని ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు ఆసీస్‌తో ఆడిన 11 టెస్టుల్లో 21.39 సగటుతో ఏకంగా 58 వికెట్లు పడగొట్టాడు. లార్డ్స్ వేదికగా జరిగిన 2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో సైతం 110 పరుగులిచ్చి 9 వికెట్లు తీసి సత్తా చాటాడు. కెరీర్‌లో మొత్తం 73 టెస్టుల్లో 340 వికెట్లతో రబడ మేటి బౌలర్‌గా నిలిచాడు.
మరోవైపు పేస్ బౌలర్ నాండ్రే బర్గర్ కూడా వెన్నునొప్పి కారణంగా ఇంకా కోలుకోవట్లేదు. దీంతో ప్రొటీస్ ఫాస్ట్ బౌలింగ్ విభాగం మరింత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. కాగా.. ఇటీవలే బంగ్లాదేశ్-ఏ తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి మంచి ఫామ్‌లో ఉన్న యువ పేసర్ గెరాల్డ్ కోయెట్జీని రబడ స్థానంలో తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా రెండో స్థానంలో నిలిచింది. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలంటే ఈ మూడు టెస్టుల సిరీస్ ఈ రెండు జట్లకు అత్యంత కీలకం. టెస్టు సిరీస్ కంటే ముందే సెప్టెంబర్ 24 నుంచి కింగ్స్‌మీడ్ వేదికగా దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ కూడా ప్రారంభం కానుంది. ఈ రెండు సిరీస్‌లకు సంబంధించి దక్షిణాఫ్రికా బోర్డు ఇంకా జట్టును ప్రకటించాల్సి ఉంది.













Click it and Unblock the Notifications