ఆ ఐపీఎల్ ఫ్రాంఛైజీలో పెద్ద తలకాయ అవుట్
ఐపీఎల్ 2026కు సంబంధించిన ఆక్షన్ గడువు దగ్గరికిస్తోంది. డిసెంబర్ లో రెండో వారంలో దీన్ని నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం నవంబర్ 15వ తేదీ నాటికల్లా ఫ్రాంఛైజీలు తమ రిటైన్డ్ ప్లేయర్ల జాబితాను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కు అందజేయాల్సి ఉంది. దీనికోసం అవసరమైన ఏర్పాట్లు ప్రస్తుతం సాగుతున్నాయి.
ఈ పరిణామాల మధ్య కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఐపీఎల్ 2026 సీజన్‌కు అభిషేక్ నాయర్‌ను హెడ్ కోచ్‌గా నియమించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని సమాచారం. గత వారం ఫ్రాంచైజీ ఈ నిర్ణయాన్ని అభిషేక్ నాయర్‌కు తెలియజేసినట్లు 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' వెల్లడించింది. దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

2018లో కేకేఆర్ అకాడమీకి అధిపతిగా జట్టులో చేరాడు అభిషేక్ నాయర్. ముంబైలో కొనసాగుతున్న ఈ అకాడమీ ద్వారా అనేక మంది యువ ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చారు. రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి వంటి ఆటగాళ్లతో నాయర్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. తమ కెరీర్‌కు నాయర్ ఎంతగానో సహాయపడ్డారని వారెప్పుడూ చెబుతుంటారు. ముంబైకి చెందిన మాజీ ఆల్‌రౌండర్ అయిన నాయర్, తర్వాత జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా మారారు.
2024లో కేకేఆర్ మూడో ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్నప్పుడు చంద్రకాంత్ పండిట్ నేతృత్వంలోని సపోర్ట్ స్టాఫ్‌లో ఆయన కూడా ఉన్నారు. కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్ భారత జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు, నాయర్ తో పాటు ఫీల్డింగ్ కోచ్ ర్యాన్ టెన్ డోషెట్‌లను తనతో పాటు అసిస్టెంట్ కోచ్‌లుగా నియమించుకున్నారు. 2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టుకు ఎదురైన ఘోర పరాజయం నేపథ్యంలో ఈ ఏడాది మొదట్లో నాయర్‌పై వేటు పడింది. ఆయన స్థానంలో సితాన్షు కోటక్ బ్యాటింగ్ కోచ్‌గా ఉన్నారు.
2025 సీజన్ మధ్యలో అభిషేక్ నాయర్‌ను మళ్లీ జట్టులోకి తీసుకుంది కేకేఆర్. అప్పటికే జట్టు ఫామ్‌లో లేకపోవడం వల్ల ఆయన కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. టైటిల్ గెలిచిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను నిలబెట్టుకోలేకపోయిన కేకేఆర్.. పేలవమైన ఆక్షన్ తర్వాత 14 మ్యాచ్‌లల్లో అయిదింట్లో మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. వచ్చే సీజన్ లో నాయర్ ఎంత వరకు జట్టును విజయతీరాలకు చేర్చుతాడనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications