నక్కతోక తొక్కొచ్చిన రాజస్థాన్ రాయల్స్: రూ. 15,600 కోట్ల భారీ డీల్ సెట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాప్ ఫ్రాంచైజీల్లో ఒకటైన రాజస్థాన్ రాయల్స్ చేతులు మారింది. దీనికి సంబంధించి ఓ భారీ డీల్ కుదిరింది. దేశీయ పారిశ్రామిక దిగ్గజాలు లక్ష్మీ నివాస్ మిట్టల్, ఆదిత్య మిట్టల్ దీన్ని కొనుగోలు చేశారు. వారి సారథ్యంలోని కన్సార్టియం రాజస్థాన్ రాయల్స్ ను కొనుగోలు చేసింది. దీని విలువ 15,600 కోట్ల రూపాయలు. సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత ఆదార్ పూనావాలా కూడా ఈ కన్సార్టియంలో ఉన్నారు.
ఈ ఒప్పందంలో ఐపీఎల్ జట్టుకు మాత్రమే పరిమితం కాలేదు. దక్షిణాఫ్రికా ప్రీమియర్ లీగ్ ఎస్ఏ20 ఫ్రాంఛైజీ పెర్ల్ రాయల్స్, కరీబియన్ ప్రీమియర్ లీగ్ టీమ్ బార్బడోస్ రాయల్స్ కూడా ఉన్నాయి. ఈ మూడు టీమ్ లను కూడా ఇప్పుడున్న రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం నుంచి కొనుగోలు చేసింది ఈ మిట్టల్ ఫ్యామిలీ, ఆదార్ పూనావాలాతో కూడిన కన్సార్టియం. డీల్ పూర్తయిన తర్వాత.. ఇందులో మిట్టల్ కుటుంబానికి సుమారు 75 శాతంవాటా లభిస్తుంది. అదార్ పూనావల్ల దాదాపు 18 శాతం స్టేక్స్ ను కలిగి ఉంటారు.

మిగిలిన ఏడు వాటా ప్రస్తుత ఫ్రాంఛైజీ యాజమాన్యం మనోజ్ బదాలే వద్దే ఉంటుంది. ఈ ఫ్రాంచైజీతో అనుబంధంగా కొనసాగుతారు బదాలే. ఈ డీల్‌కు బీసీసీఐ, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇంకా ఆమోదించాల్సి ఉంది. వీటితో పాటు ఇతర రెగ్యులేటరీ అథారిటీల ఆమోదం ఇంకా లభించలేదు. ఈ ప్రక్రియ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి అంటే అక్టోబర్- నవంబర్- డిసెంబర్ నాటికి పూర్తవుతుందని అంచనా
ఈ ఒప్పందం కార్యరూపం దాల్చిన తర్వాత లక్ష్మీ నివాస్ మిట్టల్, ఆదిత్య మిట్టల్, వనిషా మిట్టల్ భాటియా, అదార్ పూనావాలా, మనోజ్ బదాలే.. రాజస్థాన్ రాయల్స్ బోర్డులో చేరుతారు. ఈ భారీ డీల్ పై లక్ష్మీ నివాస్ మిట్టల్ స్పందించారు. రాజస్థాన్‌తో తనకు దీర్ఘకాల అనుబంధం ఉందని, అలాగే క్రికెట్ అన్నా తనకు ఎంతగానో ఇష్టమని పేర్కొన్నారు. ఈ కారణంతోనే క్రికెట్ ను ఆస్వాదించడానికి రాజస్థాన్ రాయల్స్ కంటే మెరుగైన జట్టు మరేదీ ఉండదని భావించానని వ్యాఖ్యానించారు.
ఆదిత్య మిట్టల్ ఐపీఎల్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా లీగ్‌లలో ఒకటిగా అభివర్ణించారు. ఈ జట్టులో భాగం కావడం పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నానని వెల్లడించారు. అదార్ పూనావల్ల సైతం ఈ పెట్టుబడిపై తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాజస్థాన్ రాయల్స్ బలమైన వారసత్వం ఉన్న ఫ్రాంచైజీ అని, దానిని మరింత ముందుకు తీసుకెళ్లడంలో తన సహకారం ఎప్పటికీ ఉంటుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications