రోహిత్ ఇంకెంత కాలం? వన్డేలకూ అతన్ని కేప్టెన్ చేయండి
భారత జట్టు వన్డే ఫార్మట్ కేప్టెన్ రోహిత్ శర్మకు ఎర్త్ పడేలాగే కనిపిస్తోంది. అతని స్థానంలో వన్డే ఫార్మట్ కు కూడా కొత్త కేప్టెన్ ను సెలెక్ట్ చేయాలనే అభిప్రాయాలు ఊపందుకుంటోన్నాయి. దీనికి కారణం లేకపోలేదు. అండర్సన్- టెండుల్కర్ సిరీస్ లో టెస్ట్ కేప్టెన్ శుభ్ మన్ గిల్ సత్తా చాటడమే.
ప్రస్తుతం టీమిండియాలో మూడు ఫార్మట్లకూ ముగ్గురు కేప్టెన్లు ఉన్న విషయం తెలిసిందే. వన్డేలకు రోహిత్, టెస్టులకు గిల్, టీ20లకు సూర్యకుమార్ యాదవ్ సారథ్యాన్ని వహిస్తోన్నారు. వన్డే మినహా మిగిలిన ఫార్మట్లకు వీడ్కోలు పలికాడు రోహిత్. అతని స్థానంలో గిల్ కు జట్టు పగ్గాలు అందించాలనే డిమాండ్ తలెత్తుతోంది.

మాజీ క్రికెటర్ కమ్ కామెంటేటర్ మహమ్మద్ కైఫ్ ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. రోహిత్ శర్మ నుండి వన్డే కేప్టెన్సీని అందుకోవడానికి శుభ్‌మన్ గిల్ సిద్ధంగా ఉన్నాడని అన్నాడు. ఇంగ్లండ్ సిరీస్ లో గిల్ అద్భుతంగా రాణించాడని, బ్యాటర్ గా, కేప్టెన్ గా సత్తా చాటాడని చెప్పాడు.
గిల్ మొట్టమొదటి టెస్ట్ సిరీస్ ఇదే. కెప్టెన్‌గా సిరీస్ ను 2-2తో సమం చేయగలిగాడు. అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్లు లేని జట్టుతో గిల్ సిరీస్ ను డ్రా చేస్తాడని చాలా మంది ఊహించలేదు. ఈ విమర్శకులకు దీటైన సమాధానం చెప్పాడు.
అతని నాయకత్వ లక్షణాలను కైఫ్ ప్రశంసించాడు. కెప్టెన్ కూల్ గా అభివర్ణించాడు. వన్డేలకు కూడా కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానాన్ని గిల్ త్వరలో భర్తీ చేస్తాడని అన్నాడు. ఆ సమయం వచ్చిందనీ వ్యాఖ్యానించాడు. ఒత్తిడిలో కూడా గిల్ కూల్ గా నాయకత్వం వహించాడని, అదే జట్టును విజయం వైపు నడిపించిందని పేర్కొన్నాడు.

రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఎంతకాలం కొనసాగుతాడో తెలియదని, గిల్ కు వన్డే కెప్టెన్సీ కూడా వస్తుందని కైఫ్ పేర్కొన్నాడు. వన్డే సారథిగా బాధ్యతలు స్వీకరించడానికి గిల్ సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నాడు. యువ ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పుడు.. కేప్టెన్ అనేవాడు వాళ్లకు స్ఫూర్తినిచ్చేలా, బ్యాట్‌తో పరుగులు చేయాలి, కెప్టెన్‌గా కూడా బాగా రాణించాల్సి ఉంటుందని అది గిల్ చేసి చూపించాడని చెప్పాడు
ఇంగ్లాండ్ పై జరిగిన ఈ అయిదు టెస్ట్ మ్యాచ్ లల్లో 75.4 సగటుతో 754 పరుగులు చేశాడు గిల్. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. తొలి టెస్టులో అద్భుతమైన 147, రెండో టెస్టులో రెండు ఇన్నింగుల్లో కలిపి 430 పరుగులు (269, 161) సాధించాడు. నాలుగో టెస్టులో 103 పరుగులు చేశాడు.












Click it and Unblock the Notifications