డీఎస్పీగా మహ్మద్ సిరాజ్
టీ20 ప్రపంచ కప్ సాధించిన భారత జట్టులో సభ్యుడైన క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్‌కు ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టు నెలలో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 78లో 600 చదరపు గజాల స్థలాన్ని సిరాజ్‌కు కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ క్రమంలో తాజాగా శుక్రవారం మహ్మద్ సిరాజ్‌కు డీఎస్పీ పోస్టు కేటాయించారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ జితేందర్.. సిరాజ్‌కు డీఎస్పీ నియామక పత్రాలు అందజేశారు. దీంతో సిరాజ్ డీఎస్పీగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖకు సిరాజ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మహ్మద్ సిరాజ్ వెంట ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, టీజీఎంఆర్ఈఐఎస్ అధ్యక్షుడు మహ్మద్ ఫహీముద్దీన్ ఖురేషీ ఉన్నారు.

కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో భారత దేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు, గౌరవాన్ని తెచ్చాడంటూ మొహమ్మద్ సిరాజ్‌ను సీఎం రేవంత్ అభినందించారు. టీ20 వరల్డ్ కప్‌ను గెలిచిన అనంతరం హైదరాబాద్‌కు చేరిన సిరాజ్ సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సిరాజ్‌ను సీఎం ఘనంగా సన్మానించారు.
సిరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌లో తన అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తున్నాడని, అందుకే ఈ రోజు అత్యున్నత స్థాయి క్రికెటర్లలో ఒకడిగా పేరు సంపాధించాడని సీఎం రేవంత్ కొనియాడారు. టీమిండియాలో ఏడేళ్లు సేవలు అందిస్తుండటమేగాక, ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టీమిండియా గెలుపు బృందంలో సిరాజ్ ఉన్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో అడుగుపెట్టిన సిరాజ్‌కు హైదరాబాద్‌లో క్రికెట్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సిరాజ్‌ను సన్మానించడంతోపాటు నజరానాలను ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రికి మహమ్మద్ సిరాజ్ తన ప్రగాఢమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. అనిల్ కుమార్ యాదవ్, ఫహీముద్దీన్ ఖురేషీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా క్రీడాకారుల అభివృద్ధికి స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనే దార్శనికతను ప్రస్తావిస్తూ క్రీడలను ప్రోత్సహించడంలో ముఖ్యమంత్రికి ఉన్న అంకితభావాన్ని ప్రస్తావించారు.
ముఖ్యమంత్రి రేవంత్ మార్గదర్శకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా క్రీడా సదుపాయాలను ఏకీకృతం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను కూడా వారు గుర్తించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ స్థాపనకు సంబంధించిన పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు.












Click it and Unblock the Notifications