ముదిరిన ముస్తాఫిజుర్ వివాదం: ఐపీఎల్ ప్రసారాలపై బంగ్లాదేశ్ నిరవధిక నిషేధం!
బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య పెరుగుతున్న రాజకీయ, క్రీడా పరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.ఐపీఎల్ 2026 నుంచి బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) విడుదల చేసిన నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆ దేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రసారాలపై, ప్రకటనలపై నిరవధిక నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏమిటీ వివాదం?
ఐపీఎల్ 2026 మినీ వేలంలో ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 9.20 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల వార్తల నేపథ్యంలో.. బీసీసీఐ (BCCI) జోక్యం చేసుకుని ముస్తాఫిజుర్‌ను వదిలేయాలని కేకేఆర్ ఫ్రాంచైజీని ఆదేశించింది. దీనిపై బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులు, ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి.

ప్రభుత్వ నోటీసులో ఏముంది?
జనవరి 5, 2026న బంగ్లాదేశ్ సమాచార మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటీసు ప్రకారం.. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం ఏమాత్రం తార్కికం కాదు. ఇది బంగ్లాదేశ్ ప్రజల మనోభావాలను దెబ్బతీసింది, వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. కాబట్టి 'ప్రజా ప్రయోజనాల' దృష్ట్యా ఐపీఎల్ ప్రసారాలను, ప్రచారాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
టీ20 వరల్డ్ కప్‌కూ నో!
ఐపీఎల్ బ్యాన్‌కు ముందే బంగ్లాదేశ్ మరో షాకిచ్చింది. వచ్చే ఫిబ్రవరిలో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ఆడేందుకు తమ జట్టు భారత్‌కు రాదని తేల్చి చెప్పింది. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఐసీసీకి సమాచారం అందించింది. తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని డిమాండ్ చేసింది.
ముదిరిన రాజకీయ సెగ
ఈ వివాదం క్రీడల నుంచి రాజకీయ రంగు పులుముకుంది. బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఐపీఎల్‌లో అనుమతించడంపై భారత్‌లోని కొన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేయగా.. ప్రతిస్పందనగా బంగ్లాదేశ్ ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌ల భవిష్యత్తుపై కూడా నీలినీడలు కమ్ముకునేలా చేస్తోంది.












Click it and Unblock the Notifications