పాకిస్తాన్ స్టార్ బౌలర్ షహీన్ షా అఫ్రిది నిఖా: మాజీ కేప్టెన్ కూతురితో..!!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ స్టార్ బౌలర్ షహీన్ షా అఫ్రిది పెళ్లి పీటలు ఎక్కాడు. ఓ ఇంటివాడయ్యాడు. మంగళవారం రాత్రి కరాచీలో అతి కొద్దిమంది ఆహ్వానితుల సమక్షంలో ఈ నిఖా కార్యక్రమం పూర్తయింది. పాకిస్తాన్ జట్టు కేప్టెన్ బాబర్ ఆజమ్, కొద్దిమంది ప్లేయర్లు, బంధుమిత్రులు దీనికి హాజరయ్యారు. నూతన దంపతులకు విషెస్ తెలిపారు.
షహీన్ షా అఫ్రిది పెళ్లాడింది ఎవరినో కాదు. పాకిస్తాన్ మాజీ కేప్టెన్, ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది కూతురు అన్షా అఫ్రిది. షాహిద్ అఫ్రిది పెద్ద కూతురు. షాహిద్- నదియా అఫ్రిది దంపతులకు అయిదుమంది కుమార్తెలు. పెద్ద కూతురిని షహెన్ షా అఫ్రిది పెళ్లి చేసుకున్నాడు. కరాచీలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ముస్లిం సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది.

ఆసియా కప్ 2023లో ఘోర పరాజయం తరువాత పాకిస్తాన్ ప్లేయర్లల్లో పెద్ద ఎత్తున విభేదాలు తలెత్తాయంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే. కేప్టెన్ బాబర్ ఆజమ్, షహీన్ షా అఫ్రిది మధ్య మనస్పర్థలు వచ్చాయని, వారిద్దరూ డ్రెస్సింగ్ రూమ్‌లో గొడవ పడ్డారనేది వారి సారాంశం.

దీన్ని తోసిపుచ్చుతూ- షహీన్ షా అఫ్రిది పెళ్లికి బాబర్ ఆజమ్ అటెండ్ అయ్యాడు. అతనితో కలిసి ఫొటోలు దిగాడు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని వెడ్డింగ్ విషెస్ తెలిపారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను బాబర్ ఆజమ్ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.

ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ జట్టు వరల్డ్ కప్ కోసం సన్నద్ధమౌతోంది. ఈ టోర్నమెంట్‌లో ఆడటానికి ఈ నెల 25వ తేదీన భారత్‌కు బయలుదేరనుంది. దుబాయ్ మీదుగా హైదరాబాద్‌కు చేరుకుంటుంది బాబర్ సేన. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగే తన తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడుతుంది.












Click it and Unblock the Notifications