హమ్ నహీ ఖేలేంగే..: భారత్ తో మ్యాచ్ లపై తేల్చేసిన పాకిస్తాన్ ప్రధాని
టీ20 వరల్డ్ కప్ ఎంతో దూరం లేదు. ఇంకో రెండు రోజులే. ఈ నెల 7వ తేదీన ప్రారంభం కాబోతోందీ టోర్నమెంట్. ప్రస్తుతం వామప్స్ నడుస్తున్నాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన వామప్స్ లో టీమిండియా అదరగొట్టింది. నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 240 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా.. దీన్ని అందుకోలేకపోయింది. ఏడు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేయగలిగింది. 30 పరుగుల తేడా ఘనవిజయం సాధించింది భారత్.
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఈ నెల 15వ తేదీన భారత్‌ను ఢీ కొనాల్సి ఉంది పాకిస్తాన్. ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని పాకిస్తాన్ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇప్పటివరకు కొంత ఊగిసలాట కనిపించింది. ఈ నిర్ణయం నుంచి పాకిస్తాన్ వెనక్కి తగ్గుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు వీటన్నింటికీ తెరదించింది పాకిస్తాన్. లీగ్ దశలో భారత్ తో జరగాల్సిన మ్యాచ్ లన్నింటినీ కూడా బాయ్ కాట్ చేసినట్లు వెల్లడించింది.

ఈ విషయాన్ని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ స్వయానా ప్రకటించారు. ఈ ఎపిసోడ్ మొత్తంపై ఆయన స్పందించడం ఇదే తొలిసారి. ఇస్లామాబాద్‌లో ఫెడరల్ క్యాబినెట్ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. భారత్ తో మ్యాచ్ లు ఆడబోమని పునరుద్ఘాటించారు. యావత్ పాకిస్తాన్ ఇదే కోరుకుంటోందని, అందుకే స్పష్టమైన వైఖరి తీసుకున్నామని, గత నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని షరీఫ్ తెలిపారు.
భారత్‌తో జరిగే మ్యాచ్‌ను చాలా జాగ్రత్తగా అంచనా వేసిన తర్వాతే బహిష్కరించాలని నిర్ణయించుకున్నామని షెహబాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. క్రీడలలో రాజకీయాలు ఉండకూడదని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం సరైనదేనని అభివర్ణించారు. అన్ని కోణాల్లో, చాలా జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే భారత్ తో మ్యాచ్ లను బహిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. టీ20 ప్రపంచ కప్‌లో మేము భారత్‌తో ఆడబోమని, బంగ్లాదేశ్‌కు మద్దతుగా నిలుస్తామనీ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications