పాకిస్థాన్‌కు చుక్కలు చూపించిన నెదర్లాండ్స్.. 9 బంతుల్లో సీన్ రివర్స్!
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 ఆరంభంలోనే పెను సంచలనం నమోదయ్యే ప్రమాదం తృటిలో తప్పింది. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో నెదర్లాండ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో అతికష్టం మీద విజయం సాధించింది. ఒకానొక దశలో నెదర్లాండ్స్ విజయం ఖాయమని భావించినా.. పాక్ లోయర్ ఆర్డర్ బ్యాటర్ అద్భుతం చేయడంతో కథ అడ్డం తిరిగింది.
ఒక్కసారిగా మారిన లెక్కలు
148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 18వ ఓవర్ ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి కేవలం 119 పరుగులు మాత్రమే చేసింది. చేతిలో కేవలం 3 వికెట్లు మాత్రమే ఉండటం, క్రీజులో స్పెషలిస్ట్ బ్యాటర్లు లేకపోవడంతో పాక్ ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. అయితే 8వ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఫహీమ్ అష్రఫ్ మ్యాచ్ రూపురేఖలను మార్చేశాడు. కేవలం 11 బంతుల్లో 29 పరుగులు బాది నెదర్లాండ్స్ నోటికాడ ముద్దను లాగేసుకున్నాడు.

నెదర్లాండ్స్ పోరాటం
ముందుగా బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (29 బంతుల్లో 37) ఒంటరి పోరాటం చేయడంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. పాక్ బౌలర్లలో సల్మాన్ మీర్జా మూడు వికెట్లు తీయగా, మొహమ్మద్ నవాజ్, అబ్రార్ అహ్మద్, సయ్యద్ అయూబ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిదికి ఒక వికెట్ దక్కింది.
ఉత్కంఠగా సాగిన పాక్ ఇన్నింగ్స్
లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ ఓపెనర్లు సాహిబ్‌జాదా ఫర్హాన్ (47), సయ్యద్ అయూబ్(24) ధాటిగా ఆరంభించినప్పటికీ.. మిడిలార్డర్ కుప్పకూలింది. కెప్టెన్ బాబర్ ఆజం (15) మరోసారి నిరాశపరిచాడు. 114 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న పాకిస్థాన్‌ను ఫహీమ్ అష్రఫ్ తన మెరుపు ఇన్నింగ్స్‌తో గట్టెక్కించాడు. మూడు బంతులు మిగిలి ఉండగానే పాక్ లక్ష్యాన్ని ఛేదించింది. చివరికి పాకిస్థాన్ పసికూన మీద కూడా కష్టపడాల్సి వచ్చింది. చిన్న జట్టు మీదే ఇంతలా కష్టపడితే.. బడా జట్లతో కష్టమేనని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications