తడాఖా చూపిన పీవీ సింధు- పూర్వవైభవం: ఫైనల్స్ లో గ్రాండ్ ఎంట్రీ
మహిళా బ్యాడ్మింటన్ సంచలనం, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు మరోసారి రికార్డు సృష్టించారు. ప్రతిష్ఠాత్మక జపాన్ ఓపెన్ సెమీ ఫైనల్స్ లో చెలరేగారు. ప్రత్యర్థిని చిత్తు చేస్తూ ఫైనల్‌కు దూసుకెళ్లింది. జపాన్ ఓపెన్ ఫైనల్ లో అడుగు పెట్టడం ఆమె కెరీర్‌లో ఇదే మొదటిసారి. మహిళల సింగిల్స్ సెమీఫైనల్ లో చైనాకు చెందిన తన చిరకాల ప్రత్యర్థి, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ చెన్ యుఫీపై అద్భుత విజయాన్ని సాధించారు.
ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో తొలి గేమ్ నుంచే పట్టు బిగించారు. తొలి సెట్ ను 21-19తో కైవసం చేసుకున్న తర్వాత.. ఇక ఆమెకు ఎదురు లేకుండా పోయింి. రెండో గేమ్‌ను దాదాపుగా ఏకపక్షంగా మార్చివేశారు. పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఈ సెట్ ను 15-10తో సొంతం చేసుకున్నారు. సరిగ్గా అదే సమయంలో చెన్ యుఫీ గాయపడటం పీవీ సింధుకు కలిసొచ్చింది. హామ్‌స్ట్రింగ్ గాయంతో బాధపడుతూ కోర్టు నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించారు యూఫీ. దీంతో అంపైర్లు సింధును విజేతగా ప్రకటించారు.

ఈ చిరస్మరణీయ విజయంతో చైనా క్రీడాకారిణి చెన్ యుఫీపై గతంలో ఉన్న వరుస అయిదు మ్యాచ్‌ల ఓటముల పరంపరకు సింధు ఒకేసారి అడ్డుకట్ట వేసినట్టయింది. కొంతకాలంగా యుఫీ చేతిలో వరుస పరాజయాలు ఎదుర్కొంటున్నారామె. ఈ కీలక పోరులో మాత్రం మొదటి నిమిషం నుంచే దూకుడుగా ఆడారు. ఎటువంటి ఒత్తిడి లేకుండా గేమ్ ప్లాన్‌ను అమలు చేశారు. తన పూర్వవైభవాన్ని సొంతం చేసుకున్నట్టయింది. లాంగ్ ర్యాలీలతో సత్తా చాటారు. నెట్ గేమ్, గ్రౌండ్ షాట్స్ ఆడిన తీరు పాత పీవీ సింధును గుర్తుకు తెచ్చింది.
ఈ తాజా విజయంతో జపాన్ ఓపెన్ చరిత్రలోనే మొదటిసారిగా ఫైనల్ లో అడుగుపెట్టి సింధు తన కేరీర్ పరంగా కూడా బౌన్స్ బ్యాక్ అయ్యారు. 2024 సీజన్ తర్వాత ఆమె మళ్లీ ఓ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టూర్ ఫైనల్స్ కు చేరుకోవడం ఇదే మొదటిసారి. ఈ మధ్యకాలంలో ఆడిన ఏ టోర్నమెంట్ లో కూడా పెద్దగా రాణించలేదు. గేమ్ నుంచి తప్పుకోక తప్పదనే వార్తలు వెల్లువెత్తిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె తడాఖా చూపడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఆదివారం జరగబోయే ఫైనల్ లో సింధు జపాన్‌కే చెందిన స్టార్ క్రీడాకారిణి అకానె యామగుచి లేదా ఇండోనేషియాకు చెందిన యువ సంచలనం పుత్రి కుసుమ వర్దానీల్లో ఒకరిని ఢీ కొట్టాల్సి ఉంటుంది. వీరి మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో సింధు తలపడనున్నారు. జపాన్ ఓపెన్ గోల్డ్ మెడల్ సాధించి రికార్డు నెలకొల్పడానికి సింధు ఒక్క అడుగు దూరంలో నిలిచారు. దీన్ని గెలుచుకోవడం ద్వారా తన సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలకాలని ఆశిస్తోన్నారు.














Click it and Unblock the Notifications