ఆర్సీబీ ఓటమికి అయిదు కారణాలు
RCB vs GT: ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి ఓటమిని చవి చూసింది. ఇప్పటివరకు ఆడిన మూడింట్లో రెండింటిని గెలిచిన ఆర్సీబీ.. తన హోమ్ పిచ్‌పై పరాజయాన్ని చవి చూసింది. 169 పరుగుల స్కోర్‌ను కాపాడుకోలేకపోయింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దిగజారింది.
ఎనిమిది వికెట్ల తేడాతో..
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో మట్టికరిచింది ఆర్సీబీ. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఈ లోకల్ టీమ్- నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగా.. ఇంకా 13 బంతులు మిగిలివుండగానే గుజరాత్ టైటాన్స్ దాన్ని కొట్టి అవతలపడేసింది.

లివింగ్ స్టన్ ఒక్కడే..
ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్.. వంటి టాప్ క్లాస్ బ్యాటర్లు టీమ్‌లో ఉన్నప్పటికీ- బరువు మాత్రం మిడిలార్డర్ మోయాల్సొచ్చింది. లియామ్ లివింగ్‌స్టొన్, వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ, చివర్లో టిమ్ డేవిడ్ మినహా మరెవరూ కూడా రాణించలేకపోయారు. డెత్ ఓవర్లల్లో టీమ్ డేవిడ్ భారీ షాట్లు బాదడంతో ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది ఆర్సీబీ.
టాప్ ఆర్డర్ విఫలం..
ఆర్సీబీ టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలం అయ్యారు. ఫిల్ సాల్ట్- 14, విరాట్ కోహ్లీ- 7, దేవదత్ పడిక్కల్- 4, రజత్ పటిదార్- 12 పరుగులు చేశారు. దెబ్బకు 42 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఉన్నంతలో లియామ్ లివింగ్‌స్టొన్- 54, జితేష్ శర్మ- 33 పరుగులు చేశారు గానీ అది వారి స్థాయికి తగ్గ ఆటతీరు కాదు. కృనాల్ పాండ్యా చేసింది అయిదు పరుగులే.

ముంచిన బౌలర్లు..
నిజానికి- 169 పరుగులు పోరాడ దగ్గ, కాపాడుకోదగ్గ స్కోరే. అయినప్పటికీ బౌలర్ల వైఫల్యం రాయల్ ఛాలెంజర్స్ ఓటమికి బాటలు వేసింది. బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఇద్దరు ముగ్గురయినా రాణించగలిగారు గానీ బౌలర్లు మాత్రం పూర్తిగా చేతులెత్తేశారు. ఒక్కరు కూడా గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లను భయపెట్టలేకపోయారు. స్వేచ్ఛగా ఆడిన జోస్ బట్లర్‌ను కట్టడి చేయలేకపోయారు.
అనుభవజ్ఞులు ఉన్నా..
భువనేశ్వర్ కుమార్, హేజిల్‌వుడ్, యష్ దయాళ్ వంటి అనుభవజ్ఞులు ఉన్నా గుజరాత్ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టలేకపోయారు. హేజిల్‌వుడ్ ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు. ధారాళంగా పరుగులను సమర్పించుకున్నాడు. 3.5 ఓవర్లల్లో ఏకంగా 43 పరుగులను పిండుకున్నారు గుజరాత్ బ్యాటర్లు. ఇందులో మూడు ఫోర్లు, నాలుగు సిక్సులు ఉన్నాయి. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లోనే అత్యధికంగా అయిదు సిక్సులు కొట్టారు బ్యాటర్లు.
భువనేశ్వర్‌కు నో సపోర్ట్..
భువనేశ్వర్ కుమార్ కాస్త ఫర్వాలేదనిపించుకున్నాడు. నాలుగు ఓవర్లల్లో 23 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. రసిఖ్ సలాం, కృనాల్ పాండ్యా విఫలం అయ్యారు. మూడు ఓవర్లల్లో వారిద్దరూ 35, 34 పరుగులు ఇచ్చుకున్నారు. వీరిద్దరూ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు.












Click it and Unblock the Notifications