IPL 2024 కోసం స్టార్ బ్యాటర్ కమ్ బ్యాక్
Rishabh Pant: ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్ ఆరంభం కావడానికి ఎంతో సమయం లేదు. ఈ నెల 22వ తేదీన ఈ సీజన్ ఆరంభం కానుంది. రెండున్నర నెలల పాటు అంటే 74 రోజుల పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే బిగ్గెస్ట్ టోర్నమెంట్ ఇది.
ఐపీఎల్ ఆడే అన్ని జట్లు కూడా సమూలంగా మారిపోయిన విషయం తెలిసిందే. డిసెంబర్‌లో జరిగిన వేలం పాట తరువాత అన్ని ఫ్రాంఛైజీల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. చాలామంది ప్లేయర్లు అటు ఇటు అయ్యారు. కొత్త ఫ్రాంఛైజీల తరఫున ఆడబోతోన్నారు. కొత్త సారథులు వచ్చారు. ఓ మోస్తరు ప్లేయర్లు భారీ రేటు పలికారు. మరికొందరు స్టార్ ఆటగాళ్లు అన్ సోల్డ్‌గా మిగిలారు.

ఈ పరిస్థితుల్లో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్.. ఐపీఎల్ 2024 సీజన్ కోసం కమ్ బ్యాక్ అయ్యాడు. ఈ సీజన్‌లో ఆడబోతోన్నాడు. అతని ఫిట్‌నెస్‌పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్.. కీలక ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్ మ్యాచ్‌లను ఆడటానికి రిషభ్ పంత్ వంద శాతం ఫిట్‌నెస్ సాధించాడని తెలిపింది.
2022 డిసెంబర్ 30వ తేదీన ఓ రోడ్డు ప్రమాదంలో రిషభ్ పంత్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. మరణం అంచుల్లో నుంచి బయట పడ్డాడు. అతను ప్రయాణించిన కారు రోడ్డు డివైడర్‌ను ఢీ కొట్టి.. దగ్ధమైంది. కారులో ఇరుక్కున్న రిషభ్ పంత్‌ను ఆ మార్గంలో వెళ్లిన కొందరు వాహనదారులు రక్షించారు.
అప్పటి నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు పంత్. సుమారు ఆరు నెలల పాటు కాలు కింద పెట్టలేని స్థితిలో గడిపాడు. బీసీసీఐ అతనికి నాణ్యమైన వైద్య చికిత్సను అందించింది. ఆ తరువాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలేటషన్‌లో ఉన్నాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు.
దీనితో ఐపీఎల్ మ్యాచ్‌ను ఆడటానికి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐపీఎల్‌లో ఢిల్లీ కేపిటల్స్ తరఫున ఆడుతున్నాడు రిషభ్ పంత్. త్వరలోనే అతను జట్టుతో కలుస్తాడని డీసీ ఫ్రాంఛైజీ కూడా తెలిపింది. 14 నెలల తరువాత క్రికెట్‌లో కమ్ బ్యాక్ కావడం.. అతను ఎలా ఆడతాడనేది ఆసక్తి రేపుతోంది.












Click it and Unblock the Notifications