రోహిత్ శర్మ డిజాస్టర్ టూర్
న్యూజిలాండ్‌తో జరుగుతున్న అయిదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత జట్టు మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ నిరాశాపరిచాడు. అధ్వాన్న ప్రదర్శనతో సిరీస్ ముగించాడు. చివరి వన్డేలో కూడా ఆయన బ్యాట్ నుంచి పరుగులు జాలువారలేదు. ఏడు పరుగులకే క్రీజు వదిలి పెవిలియన్‌కు చేరుకున్నాడీ డాషింగ్ ఓపెనర్. దీంతో అతని ఫామ్‌పై క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. న్యూజిలాండ్ గడ్డపై తన కెరీర్‌లో బహుశా ఆఖరి వన్డే సిరీస్ ఆడుతున్న రోహిత్.. పర్యటన పొడవునా పరుగుల కోసం తంటాలు పడాల్సొచ్చింది.
హిట్‌మ్యాన్‌గా గుర్తింపు పొందిన రోహిత్ శర్మకు ఈ వన్డే సిరీస్ ఒక పీడకలలా మారింది. ఈ సిరీస్‌లో మొత్తం నాలుగు ఇన్నింగ్స్‌లల్లో బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ 30 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అందులో రెండు మ్యాచ్‌ల్లో డకౌట్లు కూడా ఉన్నాయి. ఖాతా తెరవకుండానే సున్నా పరుగులకే వెనుదిరిగాడు. ఈ సిరీస్‌లో అతని బ్యాటింగ్ యావరేజ్ 7.5 గా రికార్డయింది. స్ట్రైక్ రేట్ 62.5కే పరిమితమైంది. రోహిత్ శర్మ మొత్తం వన్డే కేరీర్ లోనే ఇది లోయెస్ట్ యావరేజ్ కావడం అతని బ్యాటింగ్ తీరుకు అద్దం పట్టినట్టయింది.

తొలి వన్డేలోనే రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. రెండో మ్యాచ్ లో 23 పరుగులకు పెవిలియన్ చేరాడు. వర్షం వల్ల మూడో రద్దయింది. ఆ తరువాత కూడా రోహిత్ బ్యాటింగ్ తీరులో ఎలాంటి మార్పూ కనిపించలేదు. నాలుగో వన్డేలో మళ్లీ డకౌట్ అయ్యాడు. పైగా అది గోల్డెన్ డకౌట్. ఎదుర్కొన్న మొదటి బంతికే అవుట్ అయ్యాడు. ఇక ఆఖరి వన్డేలో 13 బంతులు ఎదుర్కొని ఒకే ఒక ఫోర్‌తో ఏడు పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. నాలుగు మ్యాచ్ లల్లో రెండు డకౌట్లంటే అతని ఫామ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
రోహిత్ శర్మ నిలకడలేమి భారత జట్టు ఓపెనింగ్ భాగస్వామ్యాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత ఓపెనర్లు ఒక్కసారి కూడా 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయలేకపోయారు. గతంలో 2017-18 దక్షిణాఫ్రికా పర్యటనలో కూడా భారత ఓపెనింగ్ జోడీ ఇలాగే విఫలమైంది. ఆ పర్యటనలో ఆరు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 148 పరుగులు మాత్రమే చేసి, గరిష్ఠంగా 48 పరుగుల భాగస్వామ్యానికే పరిమితమయ్యారు. ఎనిమిదేళ్ల తర్వాత టీమిండియా మళ్లీ అలాంటి నిరాశాజనక పరిస్థితులనుఎదుర్కోవాల్సి వచ్చింది.
న్యూజిలాండ్‌లోని ఫాస్ట్ బౌలింగ్, స్వింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై రోహిత్ శర్మ ఇబ్బంది పడటం రాబోయే వన్డే ప్రపంచకప్ లో అతను ఆడటంపై అనేక అనుమానాలకు తెర తీసింది. వరల్డ్ కప్ వరకూ జట్టులో కొనసాగాలంటే తన సత్తాను నిరూపించుకోవాల్సిన బాధ్యత రోహిత్ శర్మపై పడింది. విదేశీ పిచ్‌లపై టాప్ ఆర్డర్ వైఫల్యాలను త్వరితగతిన అధిగమించాల్సిన అవసరం అటు టీమిండియా మేనేజ్‌మెంట్‌కూ ఉంది.












Click it and Unblock the Notifications
