మొన్న బుమ్రా, నిన్న గిల్.. నేడు ఈ డాషింగ్ బ్యాటర్ అవుట్: రీప్లేస్మెంట్ తలనొప్పి
శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కొలంబో విమానం ఎక్కక ముందూ, ఆ తర్వాతా గాయాల బెడద వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ ప్రిత్ బుమ్రా శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్‌కు దూరం అయ్యాడు. ఎడమ మోకాలి గాయం నుంచి అతను ఇంకా పూర్తిగా కోలుకోకపోవట్లేదు. ప్రాక్టీస్ సెషన్ లో వేలి గాయం వల్ల కేప్టెన్ శుభ్ మన్ గిల్ కూడా వామప్ మ్యాచ్ లో ఆడట్లేదు.
ఈ పరిణామాల మధ్య మరో డాషింగ్ ఓపెనర్ జట్టుకు దూరం అయ్యాడు. గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. అతనే.. సాయి సుదర్శన్. ఈ నెల 15 నుంచి గాలే వేదికగా శ్రీలంకతో మొదటి టెస్ట్ మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉన్న ఈ పరిస్థితుల్లో అతను జట్టుకు అందుబాటులో ఉండట్లేదు. గాయం కారణంగా సాయి సుదర్శన్ మొదటి టెస్ట్ లో ఆడట్లేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అధికారికంగా వెల్లడించింది.

కాలి బొటనవేలి గాయంతో ఈ డాషింగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ బాధపడుతున్నాడు. మొదటి మ్యాచ్ ఆరంభం అయ్యే సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించడం కష్టంగా మారింది. దీంతో సెలెక్టర్లు ఇప్పుడు ప్రత్యామ్నాయ ఆటగాళ్ల అన్వేషణలో పడ్డారు. ప్రస్తుతం సాయి సుదర్శన్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) లో రిహాబిలిటేషన్ లో ఉన్నాడు. 15వ తేదీ నాటికి అందుబాటులోకి రావొచ్చని మొదట మేనేజ్‌మెంట్ ఆశించింది గానీ అది సాధ్యపడట్లేదు. నేషనల్ క్రికెట్ అకాడమీ మెడికల్ స్టాఫ్ నుంచి క్లియరెన్స్ లభించడం అసాధ్యం.
సాయి సుదర్శన్ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనేది చర్చనీయాంశమౌతోంది. దేవ్ దత్ పడిక్కల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. శ్రీలంకతో జరుగుతున్న మూడు రోజుల వామప్ మ్యాచ్ లో అతను సెంచరీతో కదం తొక్కాడు. 121 బంతుల్లో 14 ఫోర్లతో అద్భుతమైన శతకాన్ని సాధించి సెలెక్టర్ల దృష్టిని తనవైపు తిప్పుకొన్నాడు. దీంతో గాలె టెస్ట్ లో పడిక్కల్ ఆడే అవకాశాలు లేకపోలేదు. అదే సమయంలో ఏపీకి చెందిన యువ సంచలనం షేక్ రషీద్, ముంబై డాషింగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ కూడా రేసులో ఉన్నారు.
రషీద్ ఇటీవలే శ్రీలంకలో పర్యటించిన భారత్ ఎ జట్టులో సభ్యుడు. అక్కడ ఆడిన మూడు ఇన్నింగ్స్‌లలో 45, 63, 20 పరుగులతో రాణించి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన సర్ఫరాజ్ ఖాన్ పేరును కూడా బీసీసీఐ సెలెక్టర్లు పరిశీలిస్తోన్నారు. వారం రోజులుగా అతను బెంగళూరులోనే ఫిట్‌నెస్ పరీక్షలను పూర్తి చేసుకుంటోన్నాడు. స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొనే సామర్థ్యం ఉండటం సర్ఫరాజ్ కు కలిసొస్తోంది.




Click it and Unblock the Notifications