ICU లో ఉన్న శుభ్‌మన్ గిల్..: ఆ సమస్య తీవ్రం
మెడ నొప్పితో భారత క్రికెట్ జట్టు కేప్టెన్ శుభ్‌మన్ గిల్ బాధపడుతున్నాడు. అతని గాయం మరింత తీవ్రమైంది. కోల్ కత వుడ్ ల్యాండ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. ఇంటెన్సివ్ క్రిటికట్ యూనిట్ లో చికిత్స పొందుతున్నాడు. అతని కోసం ప్రత్యేకంగా క్రిటికల్ కేర్ ప్యానెల్ ఏర్పాటయిందంటే.. గాయం తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బీసీసీఐ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. బీసీసీఐ మెడికల్ టీమ్ అతనికి అందుతున్న చికిత్సను పర్యవేక్షిస్తోంది.
కోల్‌కత ఈడెన్ గార్డెన్స్ లో దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట మధ్యలో గిల్ గ్రౌండ్ ను వీడిన విషయం తెలిసిందే. వ్యక్తిగత స్కోర్ నాలుగు పరుగులు మీద ఉన్నప్పుడు క్రీజ్ లో అనీజీగా కనిపించాడు. సైమన్ హార్మర్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడిన తర్వాత మెడ పట్టుకుని నొప్పితో బాధపడ్డాడు. రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. జట్టు మెడికల్ టీమ్ అతనికి తాత్కాలిక ఉపశమనాన్ని కల్పించింది.

అనంతరం ఆసుపత్రికి తరలించారు. అక్కడ స్కాన్ తీయగా.. మెడ గాయం తీవ్రమైనదిగా తేలింది. దీంతో అతన్ని ఐసీయూకు తరలించారు. డాక్టర్ సప్తర్షి బసు పర్యవేక్షణలో గిల్ చికిత్స పొందుతున్నాడు. ఈ ప్యానెల్‌లో క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, న్యూరోసర్జన్, న్యూరాలజిస్ట్, కార్డియాలజిస్ట్ ఉన్నారు. వీరంతా అతని ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. మూడు రోజుల పాటు గిల్ ఆసుపత్రిలోనే ఉండొచ్చని తెలుస్తోంది.
దీంతో తొలి టెస్ట్ మ్యాచ్ కు అతను పూర్తిగా దూరమైనట్టే. ఈ నెల 22వ తేదీన గువాహటిలో ప్రారంభం కానున్న రెండో టెస్ట్‌కు కూడా అతను ఆడటంపై అనిశ్చితి నెలకొంది. గిల్ కోలుకోవడాన్ని బట్టి అతను గువాహటి టెస్ట్‌లో ఆడటం ఆధారపడి ఉంటుందని బీసీసీఐ తెలిపింది. మ్యాచ్ ఆరంభం అయ్యే సమయానికి అతను వందశాతం ఫిట్‌గా ఉంటాడో లేదో చెప్పడం కష్టమని వ్యాఖ్యానించింది. గిల్ ఆడకపోతే అతని స్థానంలో మరో ఆల్ రౌండర్ ను జట్టులోకి తీసుకోవచ్చు.












Click it and Unblock the Notifications