టీమిండియా ససేమిరా: పాకిస్తాన్ చేతులెత్తేస్తుందా?: ఐసీసీ ప్లాన్ బీ
Champions Trophy 2025: ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది ఈ టోర్నమెంట్‌ను పాకిస్తాన్ ఆతిథ్యాన్ని ఇవ్వబోతోండటం, ఇందులో పాల్గొనడానికి భారత్ నిరాకరించడమే దీనికి కారణం.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కావాల్సి ఉంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య దేశం పాకిస్తాన్‌తో న్యూజిలాండ్ ఢీ కొట్టాల్సి ఉంది. మార్చి 9వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. భారత్ సహా ఎనిమిది దేశాలు- పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు ఇందులో తలపడనున్నాయి. కరాచీ, లాహోర్, రావల్పిండిల్లో ఈ మ్యాచ్‌లన్నీ షెడ్యూల్ అయ్యాయి.

పాకిస్తాన్‌తో దశాబ్దాల కాలంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆ దేశ పర్యటనకు వెళ్లడానికి భారత్ అంగీకరించట్లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడటానికి జట్టును పాకిస్తాన్ పంపించడానికి ససేమిరా అంటోంది. తాము ఆడబోమనీ కరాఖండిగా తేల్చి చెప్పింది.
భారత్ వంటి బలమైన జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడకపోతే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ భారీగా నష్టపోతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. స్పాన్సరర్స్ పెద్దగా ముందుకు రారు. క్రికెట్‌ను ఆరాధించే కోట్లాదిమంది భారత అభిమానులు ఛాంపియన్స్ ట్రోఫీ చూడ్డానికీ పెద్దగా ఆసక్తి చూపరు.
వీటన్నింటనీ దృష్టిలో పెట్టుకుని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించేలా ముందస్తు ప్రణాళికలను రూపొందించింది ఐసీసీ. కొన్ని మ్యాచ్‌లను పాకిస్తాన్‌లో, భారత్ తలపడబోయే గేమ్‌లన్నింటినీ కూడా శ్రీలంక లేదా తటస్థ వేదిక దుబాయ్‌లల్లో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సూచించింది. దీనిపై పీసీబీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందనా రాలేదు.
ఒకవేళ హైబ్రీడ్ మోడల్‌లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ముందుకు రాకపోతే.. ప్లాన్ బీని సిద్ధం చేసింది ఐసీసీ. టోర్నమెంట్ మొత్తాన్నీ షిఫ్ట్ చేయాలనే నిర్ణయానికి వచ్చింది. దీన్ని దక్షిణాఫ్రికాకు తరలించాలన భావిస్తోంది. ఇది- హైబ్రిడ్ మోడల్‌లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించగలమా? లేదా? అనేది పీసీబీ నిర్ణయం మీద ఐసీసీ కార్యాచరణ ఆధారపడి ఉంది.












Click it and Unblock the Notifications