గోల్‌కీపర్‌తో ఢీ.. స్టేడియంలోనే కుప్పకూలిన 30 ఏళ్ల స్టార్ స్ట్రైకర్!
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానించే ఫుట్‌బాల్ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసే విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్పెయిన్ ఫుట్‌బాల్ లో తీవ్ర విషాదం నెలకొంది. స్పానిష్ రెండో డివిజన్ లీగ్‌లో భాగంగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో ప్రత్యర్థి గోల్ కీపర్ వేగంగా ఢీకొనడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్న సీడీ టెనెరిఫ్ క్లబ్ స్టార్ స్ట్రెకర్ జీసస్ డి మిగెల్ అలమెడా(30) మంగళవారం(నవంబర్ 3) ఉదయం చికిత్స పొందుతూ కన్నుమూశారు. 30 ఏళ్ల చిన్న వయస్సులో ఆయన ప్రాణాలు కోల్పోవడం క్రీడా ప్రపంచాన్ని శోకసంద్రంలోకి నెట్టివేసింది.
అసలేం జరిగిందంటే?
సోమవారం రాత్రి టెనెరిఫ్లోని ప్రసిద్ధ 'హెలియోడోరో రోడ్రిగ్వెజ్ లోపెజ్' స్టేడియం వేదికగా సీడీ టెనెరిఫ్, ఎఫ్‌సీ అందోర్రా జట్ల మధ్య మ్యాచ్ అత్యంత హోరాహోరీగా సాగుతోంది. నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరు జట్లు 2-2 గోల్స్‌తో సమంగా నిలవడంతో విజయం కోసం తీవ్రంగా పోటీపడ్డాయి. మ్యాచ్ స్టోపేజ్ టైంలోకి(108వ నిమిషం) అడుగుపెట్టిన వేళ టెనెరిఫ్ జట్టు విజయాన్ని ఖాయం చేసుకునేందుకు ఓ వేగవంతమైన కౌంటర్ అటాక్‌ను ప్రారంభించింది.

మిడ్ ఫీల్డ్ నుంచి వేగంగా దూసుకొచ్చన లాంగ్ బాల్‌ను అందుకోవడానికి స్ట్రైకర్ జీసస్ డి మిగెల్ ఎంతో కష్టంతో ముందుకు పరిగెత్తారు. అదే సమయంలో బంతిని ఎలాగైనా క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ఎఫ్‌సీ అందోర్రా గోల్ కీపర్ జీసస్ ఓనో తన పెనాల్టీ ఏరియాను దాటి బయటకు దూసుకొచ్చాడు. ఈ క్రమంలో ఊహించని రీతిలో గోల్ కీపర్ మోకాలు వేగంగా జీసస్ డి మిగెల్ ఛాతీపై బలంగా తాకింది. మోకాలు బలంగా తాకడంతో జీసస్ డి మిగెల్ అక్కడికక్కడే స్టేడియంలో స్పృహ తప్పి పడిపోయారు.
స్టేడియంలో అత్యవసర చికిత్స.. గోల్ కీపర్‌కు రెడ్ కార్డ్!
ప్రమాదం జరిగిన వెంటనే పరిస్థితి తీవ్రతను గ్రహించిన ఇరుజట్ల ఆటగాళ్లు ఆందోళనతో స్టేడియం బయట ఉన్న వైద్య సిబ్బందిని లోపలికి పిలిచారు. జీసస్ డి మిగెల్ ఎంతకీ స్పందించకపోవడంతో మ్యాచ్‌ను 108వ నిమిషంలోనే నిలిపివేశారు. నియమావళిని తీవ్రంగా ఉల్లంఘిస్తూ ఆటగాడి ప్రాణాలకు ముప్పు తెచ్చినందుకు రెఫరీ అందోర్రా గోల్‌కీపర్ జీసస్ ఓనోకు నేరుగా రెడ్ కార్డ్ జారీ చేసి స్టేడియం నుంచి బయటకు పంపేశారు.
వైద్యులు వెంటనే స్టేడియంలోకి చేరుకుని దాదాపు 5 నిమిషాలకు పైగా ప్రాథమిక అత్యవసర చికిత్స అందించింది. అనంతరం ఆయనను తక్షణమే అంబులెన్సులో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి వెళ్లే దారిలోని జీసస్ డి మిగెల్ కు గుండెపోటు రావడంతో పరిస్థితి మరింత విషమించింది. వైద్యులు అంబులెన్సులోనే సీపీఆర్ చేసి తీవ్రంగా శ్రమించి ఆయన గుండె కొట్టుకునేలా చేశారు.
ఆస్పత్రికి చేరిన తర్వాత ఆయనను ఐసీయూకు తరలించారు. ప్రారంభంలో ఆయన ఆరోగ్యం కొంత స్థిరంగానే ఉన్నట్లు క్లబ్ ప్రకటించినప్పటికీ.. ఘర్షణ తీవ్రత కారణంగా ఆయన న్యూరల్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ వైద్యులు ఆయనను కాపాడలేకపోయారు. మంగళవారం ఉదయం 8 గంటలకు జీసస్ డి మిగెల్ తుదిశ్వాస విడిచినట్లు క్లబ్ వర్గాలు అధికారికంగా ధ్రువీకరించాయి.
టెనెరిఫ్ క్లబ్ నివాళులు
జీసస్ డి మిగెల్ హఠాన్మరణంపై సీడీ టెనెరిఫ్ భావోద్వేగంతో ప్రకటన విడుదల చేసింది. "అత్యంత దుఃఖంతో, గుండె నిండిన భారంతో, ఇది నిజమనే విషయాన్ని నమ్మలేకపోతున్నాం. మంగళవారం ఉదయం 8 గంటలకు మా క్రీడాకారుడు జీసస్ డి మిగెల్ అలమెడా విషాదకరంగా మరణించారని తెలియజేస్తున్నాం. ఈ బాధను వర్ణించడానికి ఏ మాటలు చాలవు. ఆయన కుటుంబ సభ్యులకు, ఆప్తులకు, అభిమానులకు మా సానుభూతి తెలియజేస్తున్నాం" అని టెనెరిఫ్ క్లబ్ పేర్కొంది. ఆయన మృతి పట్ల వరల్డ్ ఫుట్ బాల్ దిగ్గజాలైన రియల్ మాడ్రిడ్, బార్సిలోనా, అట్లెటకో మాడ్రిడ్ వంటి క్లబ్‌లతో పాటు యూఈఎఫ్ఏ తీవ్ర సంతాపం ప్రకటించాయి. ఈ దుర్ఘటనతో తీవ్ర శోకసంద్రలో మునిగిన స్పెయిన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ జరగాల్సిన పలు కప్ పోటీలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.














Click it and Unblock the Notifications
