సంపుడో..సచ్చుడో: కాటేరమ్మ కొడుకుల కథ తేలిపోద్ది ఇయ్యాల
Sunrisers Hyderabad Playing 11: ఐపీఎల్ మ్యాచ్‌లో వరుస పరాయజాలను ఎదుర్కొంటోన్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. నేడు తన అయిదో మ్యాచ్ ఆడబోతోంది. సొంత గడ్డపై గుజరాత్ టైటాన్స్‌తో తలపడబోతోంది. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఉప్పల్ స్టేడియం దీనికి వేదిక.
తొలి మ్యాచ్‌లో ఆకాశం అంత స్కోర్ సాధించిన సన్‌రైజర్స్.. ఆ తరువాత చతికిల పడింది. వరుసగా మూడు మ్యాచ్‌లల్లో ఓడింది. పరాజయాల్లో హ్యాట్రిక్‌ను చవి చూసింది. ఇప్పటివరకు ఆడిన నాలుగింట్లో గెలిచింది ఒక్కటే. ప్రస్తుతం ఈ జట్టు ఖాతాలో రెండు ఉన్నవి రెండు పాయింట్లు మాత్రమే. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిందీ ఆరెంజ్ ఆర్మీ.

రాజస్థాన్ రాయల్స్‌పై బోణీ కొట్టిన తరువాత.. వరుసగా లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ కేపిటల్స్, కోల్‌కత నైట్ రైడర్స్ చేతుల్లో మట్టికరిచింది. ఇప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తనకంటే ఎంతో మెరుగ్గా, బలంగా కూడా ఉన్న గుజరాత్ టైటాన్స్‌ను ఢీ కొట్టబోతోంది.
మంచి మార్జిన్‌తో గెలిస్తే గానీ పదో స్థానం నుంచి లేవలేని దుస్థితిలో ఉందా జట్టు. సన్‌రైజర్స్ హైదరాబాద్.. తన ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన గేమ్ ఇది. ఆ జట్టు వరుస ఓటములకు ప్రధాన కారణం- బ్యాటర్లు విఫలం కావడమే. అటు బౌలింగ్‌లోనూ పెద్దగా మెరుపులు మెరిపించట్లేదు.

కాటేరమ్మ కొడుకులుగా క్రేజ్ సంపాదించిన బ్యాటర్ల ప్రతాపం అంతా తొలి మ్యాచ్‌కే పరిమితం అయిందన్నట్లు తయారైంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి.. వంటి బలమైన బ్యాటర్లు ఉన్నప్పటికీ- ఆ స్థాయిలో ఎవరూ ఆడట్లేదనేది కంటికి కనిపిస్తూనే ఉంది.
స్వయంగా ఓ బౌలరే జట్టుకు కేప్టెన్‌గా వ్యవహరిస్తోన్నప్పటికీ ఆ జట్టు బౌలింగ్ డిపార్ట్‌మెంట్ ఘోరంగా విఫలమౌతోంది. తొలి మ్యాచ్‌లో కూడా రాజస్థాన్ రాయల్స్ 242 పరుగులకు చేసిందంటే బౌలర్ల వైఫల్యమే కారణం. ఈ లోపాలన్నింటిపై రివ్యూ చేసుకున్నామని, మళ్లీ విజయాలు సాధిస్తామని చెబుతున్నాడు పాట్ కమ్మిన్స్.
గుజరాత్ టైటాన్స్‌పై ఆడబోయే సన్‌రైజర్స్ తుదిజట్టులో- ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, పాట్ కమ్మిన్స్ (కేప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్/సిమర్జీత్ సింగ్, జీషన్ అన్సారీ ఆడే అవకాశాలు ఉన్నాయి.
గుజరాత్ టైటాన్స్ తుదిజట్టులో - సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కేప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, గ్లెన్ ఫిలిప్స్/అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిశోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మకు చోటు దక్కొచ్చు.












Click it and Unblock the Notifications