సన్‌రైజర్స్ లో కొత్త ముఖం- రూ. కోటిన్నర పెట్టారు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ దగ్గరికొచ్చింది. ఈ నెల 28న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మధ్య జరుగనుంది. ఈ ఐపీఎల్ ఓపెనర్ కు బెంగళూరు ఎం చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ప్రస్తుతం 10 జట్లు తమ సన్నాహకాల్లో నిమగ్నం అయ్యాయి. ప్లేయర్లందరూ తమ జట్లతో కలుస్తున్నారు. ముమ్మరంగా ప్రాక్టీస్ సాగిస్తోన్నారు.
ఈ పరిణామాల మధ్య సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక మార్పు చేసింది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి తప్పుకోవడంతో, అతని స్థానంలో ఇంగ్లాండ్ బౌలర్ డేవిడ్ పేన్‌ను జట్టులోకి తీసుకుంది. ఎడ్వర్డ్స్‌ను వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ మూడు కోట్ల రూపాయలకు దక్కించుకోగా.. 35 సంవత్సరాల డేవిడ్ పేన్‌ను అందులో సగం మొత్తానికి అంటే కోట్లకు కొనుగోలు చేసింది.

డేవిడ్ పేన్.. లెఫ్ట్ ఆర్మ్ సీమర్. ఇంగ్లాండ్ తరపున ఒక వన్డే మాత్రమే ఆడాడు. టీ20 మ్యాచ్ లపై అతనికి పట్టు ఉంది. కేరీర్ ఇప్పటివరకు 233 టీ20 మ్యాచ్‌లలో 21.16 సగటుతో 304 వికెట్లు పడగొట్టిన అనుభవం అతనికి ఉంది. 2022లో నెదర్లాండ్స్‌తో జరిగిన తన ఏకైక అంతర్జాతీయ మ్యాచ్‌లో ఒక వికెట్ తీశాడు. గ్లౌసెస్టర్‌షైర్‌కు టీ20 క్రికెట్‌లో టాప్ వికెట్ టేకర్ అయిన పేన్ 2024 టీ20 బ్లాస్ట్ టోర్నమెంట్‌లో 17 ఇన్నింగ్స్‌లలో 33 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
హండ్రెడ్ లీగ్స్ లో వెల్ష్ ఫైర్, బీబీఎల్ లో పెర్త్ స్కార్చర్స్, ఐఎల్టీలో అడిలైడ్ స్ట్రైకర్స్, డెసర్ట్ వైపర్స్ వంటి వివిధ లీగ్‌లలో కూడా ఆడాడు. అతనికి ఉన్న అపార అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్ కోసం జట్టులోకి తీసుకుంది. అతనికి ఇదే తొలి ఐపీఎల్. ఇప్పటివరకు భారత గడ్డపై ఆడిన అనుభవం కూడా లేదు. ఈ నేపథ్యంలో డేవిడ్ పేన్ ఎలా ఆడతాడనేది చర్చనీయాంశమైంది.
మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కూడా తమ జట్టులో ఒక మార్పు చేసింది. గాయపడిన పేస్ బౌలర్ ఆకాష్ దీప్ స్థానంలో ఎడమచేతి వాటం సీమర్ సౌరభ్ దూబేను తీసుకుంది. బేస్ ప్రైజ్ 30 లక్షల రూపాయలకు అతన్ని కొనుగోలు చేసింది. గాయం కారణంగా ఆకాష్ దీప్ ప్రస్తుత సీజన్ నుంచి తప్పుకున్నాడు. అతను ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు.












Click it and Unblock the Notifications