ఫైనల్స్‌కు వర్షం గండం: ఆ 190 నిమిషాలు..!!
IND vs SA Final: ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్ కప్ 2024లో భారత్ దండయాత్ర తుదిదశకు చేరుకుంది. ఫైనల్‌లో తన సమవుజ్జీ దక్షిణాఫ్రికాను ఢీకొట్టబోతోంది. ఈ మ్యాచ్.. రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది. బార్బడొస్ రాజధాని బ్రిడ్జిటౌన్ కెన్నింగ్‌స్టన్ ఓవల్ స్టేడియం దీనికి వేదిక. ఈ టోర్నమెంట్‌లో ఓటమి అనేదే తెలియని జట్లు ఈ రెండూ.
గుయానాలో జరిగిన రెండో సెమీ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది భారత్. 68 పరుగుల తేడాతో జయకేతనాన్ని ఎగురవేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని డిపార్ట్‌మెంట్‌లల్లో టీమిండియా ప్లేయర్లు వారియర్స్‌ను గుర్తుకు తెచ్చారు. ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. తొలి సెమీ ఫైనల్స్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించి ఫైనల్స్‌లో ఎంట్రీ ఇచ్చింది దక్షిణాఫ్రికా.

అంతకుముందు- లీగ్స్‌లో గానీ, సూపర్ 8లో గానీ ఒక్క మ్యాచ్‌లో కూడా ఓటమి చవి చూడలేదు. ఆడిన అన్నింట్లోనూ విజయదుందుభి మోగించాయి. 2014 తరువాత తొలిసారిగా టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్‌కు చేరింది భారత్. బంగ్లాదేశ్ ఢాకాలో జరిగిన అప్పటి ఫైనల్స్‌లో శ్రీలంక చేతిలో ఓడింది. ఇప్పుడు మళ్లీ ఛాంపియన్‌గా నిలిచే అవకాశానికి చేరువ అయింది.
టీ20 వరల్డ్ కప్ ఆరంభంలో బోణీ కొట్టిన తరువాత ఇప్పటివరకు మళ్లీ కప్‌ను అందుకునే ఛాన్స్ భారత్‌కు రాలేదు. ఇప్పుడు గెలిస్తే రెండోసారి కప్‌ను ముద్దాడినట్టవుతుంది. టీ20 వరల్డ్ కప్‌ను రెండుసార్లు జయించిన జట్టు వెస్టిండీస్ ఒక్కటే. 2012, 2016ల్లో విండీస్ వీరులు విజేతగా నిలిచారు.
దక్షిణాఫ్రికా పరిస్థితి దీనికి పూర్తి భిన్నం. తొలిసారిగా ఫైనల్స్ చేరింది. ఐసీసీ నిర్వహించే ఏ టోర్నమెంట్‌ను తీసుకున్నా ఫైనల్స్ వరకూ రావడం ప్రొటీస్‌కు ఇదే తొలిసారి. ఒకరకంగా వారికి ఇది తొలి బిగ్గెస్ట్ ఫైనల్ మ్యాచ్. ఇందులో గెలిచితీరాలనే తపన వారిలో కనిపిస్తోంది. ఈ టోర్నమెంట్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోవడం వారి సన్నద్ధతకు అద్దంపడుతోంది.
ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయాన్ని సాధించాలంటూ దేశవ్యాప్తంగా హోమాలు, ప్రత్యేక పూజలు షురూ అయ్యాయి. ఎలాంటి విఘ్నాలు లేకుండా రోహిత్ సేన గెలవాలంటూ యజ్ఞయాగాదులను నిర్వహిస్తోన్నారు అభిమానులు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాశి, ముంబైలోని సిద్ది వినాయక ఆలయాల్లో అభిమానులు పూజలు చేశారు.
ఈ మ్యాచ్‌కు వర్షం గండం పొంచివుంది. కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియం ఉన్న బ్రిడ్జిటౌన్ సిటీలో వర్షం పడటానికి 70 శాతం అవకాశాలు ఉన్నట్లు బార్బడొస్ వాతవారణ సర్వీస్ వెల్లడించింది. ముందు రోజు కూడా బ్రిడ్జిటౌన్‌లో భారీ వర్షం పడింది. పిచ్‌ను కప్పి ఉంచారు సిబ్బంది. అవుట్ ఫీల్డ్ చిత్తడిగా తయారైంది.
ఆ తరువాత తెరిపిని ఇచ్చింది. వాతావరణం ప్రస్తుతం నిర్మలంగా ఉంది. మ్యాచ్ మొదలయ్యే సమయానికి అడపా దడపా వర్షం పడొచ్చని బార్బడొస్ వెదర్ సర్వీస్ అంచనా వేసింది. రోజంతా ఇదే చెదురుమదురు వర్షం పడుతూనే ఉంటుందని తెలిపింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉరుములు, మెరుపులలో కూడిన వర్షం పడొచ్చు. 20 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.
మ్యాచ్‌కు వర్షం అడ్డుపడినా కూడా పూర్తి ఓవర్లు ఆడటానికి అవకాశం ఉంది. 190 నిమిషాల పాటు అదనంగా మ్యాచ్ సమయాన్ని పొడిగించుకోవచ్చు. అప్పటికీ మ్యాచ్ కొనసాగకపోతే తొలి రోజు ఆట పూర్తిగా రద్దవుతుంది. మరుసటి రోజు రిజర్వ్ డే ఎలాగూ అందుబాటులో ఉంది.












Click it and Unblock the Notifications