టీమిండియా టీ20 స్పెషలిస్ట్ వెడ్డింగ్ డేట్ ఫిక్స్- సమాజ్‌వాదీ పార్టీ ఎంపీతో..!!
భారత క్రికెట్ జట్టు టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ రింకూ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. వీరిద్దరి పెళ్లి తేదీ ఖరారైంది. ఈ ఏడాది డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం జరుగనుంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని హోటల్ రమడలో ఈ వివాహ వేడుకను నిర్వహించడానికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తోన్నాయి.
చాలాకాలంగా రింకూ సింగ్, ప్రియా సరోజ్ వివాహ వార్తలపై విస్తృతంగా చర్చ సాగింది. గత ఏడాది జన్ లో లక్నో సెంట్రమ్ హోటల్‌లో ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహిత మిత్రుల సమక్షంలో వీరి నిశ్చితార్థం ముగిసింది. మొదట గత ఏడాది నవంబర్‌లో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వరుసగా దేశవాళీ టోర్నమెంట్లు, ఇంటర్నేషనల్ సీజన్ ఉన్నందున పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. అప్పటి నుండి పెళ్లి ఎప్పుడనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. దీనికి తెరపడింది. తాజాగా రింకూ సింగ్, ప్రియా సరోజ్ వివాహ తేదీపై స్పష్టత వచ్చింది.

ప్రియా సరోజ్ రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చారు. ఆమె సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ తూఫానీ సరోజ్ కుమార్తె. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మచిలీషెహర్ లోక్‌సభ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి అద్భుత విజయం సాధించారు. అత్యంత పిన్న వయసులోనే లోక్ సభలో అడుగుపెట్టిన యువ మహిళా ఎంపీల్లో ఒకరిగా ప్రియా సరోజ్ గుర్తింపు పొందారు. లా చదువుకున్న ప్రియా సరోజ్.. తండ్రి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు.
ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌కు చెందిన రింకూ సింగ్ భారత క్రికెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిర్మించుకున్నాడు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి పట్టుదలతో ఐపీఎల్‌లో కేకేఆర్ ద్వారా అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో వరుసగా అయిదు సిక్సర్లు బాది హీరో అయ్యాడు. టీమిండియాలో టీ20 స్పెషలిస్ట్ గా, బెస్ట్ మ్యాచ్ ఫినిషర్‌గా తనను తాను నిరూపించుకుంటోన్నాడు.
లక్నోలో జరగనున్న ఈ పెళ్లి వేడుకకు పలువురు వీఐపీలు తరలిరానున్నారు. టీమిండియా ప్లేయర్లు, బీసీసీఐ పెద్దలు, ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఈ వివాహానికి హాజరవుతారని సమాచారం. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో పాటు ఉత్తరప్రదేశ్‌లోని పలువురు పారిశ్రామిక వేత్తలు కూడా ఈ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించనున్నారు.












Click it and Unblock the Notifications
