రోహిత్ సేన ఫస్ట్ ఎన్‌కౌంటర్: బ్యాటింగ్ ఆర్డర్‌లో కూర్పులో మార్పులు
న్యూఢిల్లీ: ఐసీసీ ప్రపంచ కప్ 2023లో బిగ్ డే. రోహిత్ సేన రంగంలోకి దిగబోతోంది. తన మొదటి మ్యాచ్ ఆడబోతోంది. ఆస్ట్రేలియాను ఢీ కొట్టబోతోంది. ఈ మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. చెన్నైలోని ఎంఏ చిన్నస్వామి స్టేడియం ఈ బిగ్ క్లాష్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోంది.
శనివారం రెండు మ్యాచ్‌లు జరిగాయి. తొలి మ్యాచ్‌లో లో-స్కోర్ నమోదైంది. బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్‌ను మట్టికరిపించింది. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 156 పరుగులను బంగ్లాదేశ్ నాలుగు వికెట్లను కోల్పోయి ఛేదించింది.

మరో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా.. శ్రీలంక తలపడ్డాయి. పరుగుల వరద పారిన మ్యాచ్ ఇది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. లంకేయులకు చుక్కలు చూపించింది. అయిదు వికెట్ల నష్టానికి 428 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్‌లో ఏకంగా మూడు సెంచరీలు నమోదయ్యాయి.
క్వింటన్ డికాక్, రస్సీ వాన్‌డెర్ డుస్సెన్, కేప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ సెంచరీలు బాదారు. శ్రీలంక కూడా గట్టి పోటీ ఇచ్చింది. 44.5 ఓవర్లల్లో 326 పరుగులకు ఆలౌట్ అయింది. కుశాల్ మెండీస్, చరిత్ అసలంక, డాసన్ శనక హాఫ్ సెంచరీలతో రాణించారు. దీన్ని బట్టి చూస్తే మున్ముందు జరిగే మ్యాచ్‌లల్లో మరిన్ని భారీ స్కోర్లు నమోదు కావొచ్చు.
ఈ మధ్యాహ్నం భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్‌పై అందరి దృష్టీ నిలిచింది. మొన్నటికి మొన్న సొంతగడ్డపై మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో కంగారూలను ఓడించింది టీమిండియా. ఈ సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్‌లో ఓటమి చవి చూసింది. ఆస్ట్రేలియా తన స్కోరును 300 ల్యాండ్ మార్క్‌ను దాటించిన మ్యాచ్ అది.
ఈ మ్యాచ్‌లో బోణీ కొట్టడానికి రెండు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. టీమిండియా డాషింగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. డెంగ్యూ ఫీవర్ బారిన పడటం కొంత ఆందోళన కలిగించే అంశం. ఫలితంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.
గిల్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా పంపించే అవకాశం ఉంది. టాప్ ఆర్డర్‌లో విరాట్ కోహ్లీ, కీలకమైన ఫోర్త్ ప్లేస్‌లో శ్రేయాస్ అయ్యర్ లేదా సూర్యకుమార్ యాదవ్‌ను దింపవచ్చు. మిడిలార్డర్‌లో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, లోయర్ ఆర్డర్‌లో రవిచంద్రన్ అశ్విన్, శార్దుల్ ఠాకూర్‌కు ధాటిగా బ్యాటింగ్ చేసే సత్తా ఉంది.
తుది జట్టులో- రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్/సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఆడే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications