ఆ టీమిండియా స్టార్ హీరో పాకిస్తాన్ పై ఆడలేడు
ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ 2025కు కౌంట్ డౌన్ మొదలైంది. నెల రోజులు కూడా లేదు. సెప్టెంబర్ 9వ తేదీన తొలి మ్యాచ్ జరుగనుంది. 28వ తేదీన ఫైనల్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. దీనికి వేదిక. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సన్నాహలకు అనుగుణంగా ఈ టోర్నమెంట్ అదే ఫార్మాట్‌లో జరుగుతుంది.
ఈ ఎడిషన్‌లో ఎనిమిది జట్లు పాల్గొనబోతోన్నాయి. టైటిల్ కోసం భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్, ఒమన్.. తలపడనున్నాయి. మొత్తం 19 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇప్పటికే మ్యాచ్ ల తేదీలు, గ్రూపులు, వెన్యూలు ఖరారయ్యాయి కూడా.

చిరకాల ప్రత్యర్థుల మధ్య మూడు హై-ఓల్టేజ్ మ్యాచ్ లు జరిగే అవకాశం ఉంది. అన్నీ సవ్యంగా సాగితే.. భారత్- పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్ లు ఉండొచ్చు. గ్రూప్, సూపర్ 4లల్లో భారత్- పాకిస్తాన్ ఎదురుపడొచ్చు. ఈ రెండు జట్లు అంచనాలకు తగ్గట్టుగా రాణించగలిగితే ఫైనల్స్ లో ఢీ కొనడం ఖాయమౌతుంది.
ఈ టోర్నమెంట్ పై తన అభిప్రాయాలు వెల్లడించాడు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్. భారత్, పాకిస్తాన్ మధ్య క్రీడా సంబంధాలు పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఆకాంక్షించాడు. ఈ రెండు దేశాల మధ్య టెస్ట్ క్రికెట్‌ను తిరిగి ప్రారంభం కావాలని కోరుకుంటోన్నట్లు చెప్పాడు.
ఆసియా కప్ 2025లో ఈ రెండు దేశాలు తలపడబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వసీం అక్రమ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వరిసారిగా 2007లో భారత్‌లో పర్యటించింది పాకిస్తాన్. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆడింది. అప్పట్లో పాకిస్తాన్ జట్టుకు యూనిస్ ఖాన్ కేప్టెన్ గా వ్యవహరించాడు.
ఈ రెండు దేశాల మధ్య ఇలాంటి టెస్ట్ సిరీస్ మళ్లీ చూడాలని వుందని వసీం అక్రమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. టెలికం ఏషియా స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్రమ్ మాట్లాడాడు. 2025 ఆసియా కప్‌లో ఇరుదేశాలు టీ20 మ్యాచ్‌లు ఆడనున్న నేపథ్యంలో, టెస్ట్ మ్యాచ్‌లు కూడా తిరిగి ప్రారంభం కావాలని అభిప్రాయపడ్డాడు.
భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు ఎంతగానో ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయని వసీ అక్రమ్ చెప్పాడు. ఈ రెండు జట్లు మధ్య జరిగే మ్యాచ్ లకు ఉండే ప్రాధాన్యత క్రికెట్ ఆడే మరే దేశానికీ ఉండబోదని వ్యాఖ్యానించాడు. టెస్ట్ క్రికెట్ సంబంధాలు తిరిగి ప్రారంభమైతే అది చారిత్రక ఘట్టమౌతుందని అన్నాడు.
ఈ ఆసియా కప్ అంటే- ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు పండుగగా అభివర్ణించాడు అక్రమ్. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇప్పటికీ ఉద్రిక్తంగా ఉన్నాయనే విషయాన్ని పరోక్షంగా అంగీకరించాడు. ఈ ఉద్రిక్తతలను క్రీడల ద్వారా తగ్గించుకోవచ్చని ఓ ప్రశ్నకు బదులిచ్చాడు.
ఆసియా కప్ లో మిగతా గేమ్ ల మాదిరిగానే భారత్- పాక్ మ్యాచ్‌లు కూడా వినోదాన్ని పంచుతాయని ఆశిస్తున్నానని అక్రమ్ చెప్పాడు. మ్యాచ్ సమయంలో ఇరు దేశాల ప్లేయర్లు, అభిమానులు క్రమశిక్షణతో ఉండాలని, హద్దులు దాటకుండా ఉంటారని భావిస్తున్నట్లు తెలిపాడు.
ఫైనల్స్ లో భారత్- పాకిస్తాన్ తలపడే అవకాశాలు లేకపోలేదని, ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్నప్పుడు ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొన్న జట్టు గెలుస్తుందని వ్యాఖ్యానించాడు. దేశభక్తితో తమ జట్టు గెలవాలని భారతీయులు ఎలా కోరుకుంటారో.. పాకిస్తాన్ అభిమానులు కూడా అలాగే ఆకాంక్షిస్తారని చెప్పాడు.
భారత్.. ఇటీవలి కాలంలో మంచి ఫామ్‌లో ఉండటం వల్ల ఆసియా కప్ 20205 హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగడం సహజమేనని పేర్కొన్నాడు. పాకిస్తాన్ కే చెందిన మరో మాజీక్రికెటర్ బాజిద్ ఖాన్ మాట్లాడుతూ- విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేని ప్రభావం భారత జట్టుపై ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
ప్రస్తుతం టీమిండియాలో ఆటగాళ్లందరూ అత్యున్నత స్థాయిలో ఆడుతున్నారని, అయినప్పటికీ- విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లోటును భర్తీ చేయడం కష్టమేనని అన్నాడు. భారత జట్టు కేప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దాదాపు అన్ని జట్లపైనా భారీగా పరుగులు సాధించినప్పటికీ.. పాకిస్తాన్‌పై అతను రాణించలేకపోతున్నాడని, ఇది పేస్ బౌలింగ్ ప్రభావమా? లేక మరేదైనా కారణమా అనేది స్పష్టంగా తెలియరావట్లేదని చెప్పాడు.












Click it and Unblock the Notifications