వెస్టిండీస్ ఆల్ రౌండర్ లెజెండ్ కన్నుమూత- ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన మొనగాడు
క్రికెట్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా నీరాజనాలు అందుకున్న వెస్టిండీస్ దిగ్గజం సర్ గార్ ఫీల్డ్ సోబర్స్ కన్నుమూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. ఈ దిగ్గజ ఆటగాడి మరణం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు, అభిమానులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఇంగ్లీష్ కౌంటీ క్లబ్ నాటింగ్‌హామ్‌షైర్ ఆయన మరణానికి సంతాపం వ్యక్తం చేసింది. ఆయన ఇక లేరనే విషయాన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ ధృవీకరించింది. నివాళి అర్పిస్తూ ట్వీట్ పోస్ట్ చేసింది.
సర్ గార్ ఫీల్డ్ సోబర్స్ వెస్టిండీస్ టెస్ట్ క్రికెట్ జట్టుకు కూడా 1964 నుండి 1972 వరకు సారథ్యాన్ని అందించారు. ఆయన హయాంలో ఓ వెలుగు వెలిగిందీ జట్టు. 1958లో పాకిస్తాన్‌పై ఆయన సాధించిన 365 పరుగులు సుదీర్ఘ కాలం పాటు అంతర్జాతీయ టెస్ట్ రికార్డుగా నిలిచింది. నాటి మ్యాచ్ లో 365 పరుగులతో అజేయంగా నిలిచారు. 1994లో వెస్టిండీస్‌కే చెందిన మరో లెజెండరీ బ్యాటర్ బ్రియాన్ లారా 375 పరుగులు సాధించేంత వరకు ఈ అత్యధిక వ్యక్తిగత టెస్ట్ రికార్డు చెక్కుచెదరకుండా కొనసాగింది.

కౌంటీ క్రికెట్‌లో సోబర్స్ నాటింగ్‌హామ్‌షైర్ జట్టుకు సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించారు. ఎన్నో మరుపురాని విజయాలను అందించారు. కొన్ని సంవత్సరాల పాటు వెస్టిండీస్ కు ప్రాతినిథ్యాన్ని వహించారు సోబర్స్. ఆ తర్వాత నాటింగ్‌హామ్‌షైర్ కౌంటీ క్లబ్‌లో అడుగు పెట్టారు. విదేశీ ఆటగాళ్లకు సంబంధించిన నిబంధనలు సడలించిన వెంటనే సోబర్స్ క్లబ్‌కు చేరారు. ఆ వెంటనే జట్టు బాధ్యతలను స్వీకరించారు. సంచలనాలకు కేంద్రబిందువు అయ్యారు.
అప్పటివరకు పాయింట్ల పట్టికలో 15వ స్థానంలో ఉన్న నాట్స్ జట్టును ఏకంగా నాలుగో స్థానానికి చేర్చారు. నాట్స్ తరఫున ఆడిన ఫస్ట్‌క్లాస్ మ్యాచ లల్లో ఆయన ఏకంగా 7,041 పరుగులు చేశారు. ఇందులో 18 అద్భుతమైన శతకాలు ఉన్నాయి. ఆయన ఆడిన కాలంలో దాదాపు ప్రతి సీజన్‌లోనూ జట్టు బౌలింగ్, బ్యాటింగ్ సగటులలో సోబర్సే అగ్రస్థానంలో నిలిచారు.
సోబర్స్ కెరీర్‌లో అత్యంత చిరస్మరణీయమైన ఘట్టం నాట్స్ జట్టు తరఫున ఆడుతున్నప్పుడే నమోదైంది. గ్లామోర్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది చరిత్ర సృష్టించారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో ఈ అరుదైన మైలురాయిని అధిగమించిన మొట్టమొదటి బ్యాటర్‌గా ఆయనే. బౌలింగ్‌లో మీడియం పేస్, ఎడమచేతి వాటం స్పిన్‌తో నాట్స్ క్లబ్ తరఫున 281 వికెట్లు తీసి అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచారు. లిస్ట్-ఎ క్రికెట్‌లోనూ 2,553 పరుగులతో పాటు 103 వికెట్లు పడగొట్టారు.
క్రికెట్‌కు ఆయన అందించిన అసమాన సేవలకు గుర్తింపుగా రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది కాలానికే బ్రిటన్ ప్రభుత్వం ఆయనను నైట్‌హుడ్ పురస్కారంతో సత్కరించింది. బార్బడోస్ ప్రకటించిన 11 మంది అత్యున్నత నేషనల్ హీరోలలో సోబర్స్ ఒకరు. విజ్డెన్ మ్యాగజైన్ 1964లో ఆయనను క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించింది. 2000 సంవత్సరంలో ఈ శతాబ్దపు అత్యుత్తమ క్రికెటర్ గా గౌరవించింది. ఐసీసీ కూడా 2004 నుండి ప్రతి సంవత్సరం సర్ గార్ ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ పేరిట అత్యుత్తమ క్రికెటర్ అవార్డును అందిస్తూ వస్తోంది.














Click it and Unblock the Notifications