ఇంగ్లాండ్‌ను మట్టి కరిపించిన కర్ణాటక కుర్ర క్రికెటర్: రచిన్ పేరులో ఇద్దరు లెజెండరీ ప్లేయర్లు
అహ్మదాబాద్: ఐసీసీ ప్రపంచకప్ 2023 రసవత్తరంగా ఆరంభమైంది. గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయఢంకా మోగించింది. ఇంగ్లాండ్‌ను చిత్తు చిత్తు చేసింది. ఆ జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని ఇద్దరే ఇద్దరు బ్లాక్ క్యాప్స్ కొట్టి అవతల పడేశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. నిర్ణీత 50 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. బ్యాటర్లు సమష్టిగా రాణించారు. న్యూజిలాండ్ ముందు భారీ స్కోర్ పెట్టారు. జానీ బెయిర్‌స్టో- 33, జో రూట్- 77, కేప్టెన్ జోస్ బట్లర్- 43 పరుగులు చేశారు. డేవిడ్ మలన్- 14, హ్యారీ బ్రూక్- 25, లియామ్ లివింగ్‌స్టొన్- 20, మొయిన్ అలీ- 11, సామ్ కుర్రన్- 14, క్రిస్ వోక్స్- 11, ఆదిల్ రషీద్- 15, మార్క్ వుడ్- 13 పరుగులు చేశారు.

283 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బ్లాక్ క్యాప్స్ దుమ్ము లేపుతున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. జట్టు స్కోరు 10 పరుగుల వద్ద ఉన్నప్పుడు విల్ యంగ్ అవుట్ అయ్యాడు. అతనిది గోల్డెన్ డక్. ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ దారి పట్టాడు. అతని స్థానంలో ఫస్ట్ డౌన్‌గా రచిన్ రవీంద్ర క్రీజ్‌లోకి వచ్చాడు.
అక్కడ మొదలైంది న్యూజిలాండ్ పరుగుల సునామీ. ఇంగ్లాండ్ బౌలర్ల తుక్కు రేగ్గొట్టారు. రెండో ఓవర్ తొలి బంతికి వికెట్ పడగొట్టిన బౌలర్లు.. మరో వికెట్ల కోసం మ్యాచ్ మొత్తం చెమటోడ్చాల్సి వచ్చింది. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర తలో సెంచరీ బాది అవతల పడేశారు. మ్యాచ్ మొత్తాన్నీ లాగేసుకున్నారు.
ఓవర్‌కు ఏడు పరుగులు చొప్పున పిండుకున్నారు వారిద్దరూ. 36.2 ఓవర్లలోనే 283 పరుగులు చేశారంటే వారి దూకుడు ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాన్వే- 152, రచిన్ రవీంద్ర- 123 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఇద్దరూ పోటీ పడి పరుగులు సాధించారు. సిక్సర్లు, ఫోర్లతో మోతెక్కించారు.

బ్యాటింగ్ ఆర్డర్‌లో రచిన్ రవీంద్రకు ప్రమోషన్ ఇవ్వడం సత్ఫలితాన్ని ఇచ్చింది. దూకుడుగా ఆడే మనస్తత్వం ఉన్న రచిన్‌ను వామప్స్‌లో కూడా టాప్ ఆర్డర్, ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు పంపించింది న్యూజిలాండ్ మేనేజ్‌మెంట్. అక్కడ అతను సక్సెస్ అయ్యాడు. అదే మెరుపుదాడినీ ఇక్కడా కంటిన్యూ చేస్తోన్నాడు.
రచిన్ రవీంద్ర స్వస్థలం బెంగళూరు. అతని తండ్రి రవి కృష్ణమూర్తి. వ్యాపార రీత్యా న్యూజిలాండ్‌లో స్థిరపడ్డారు. సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్‌కు బిగ్గెస్ట్ ఫ్యాన్. అందుకే రాహుల్ ద్రవిడ్‌లోని ర సచిన్‌లోని చిన్ అక్షరాలతో రచిన్ రవీంద్రకు ఆ పేరు పెట్టారు. ఇప్పుడు అతనే ఇంగ్లాండ్‌పై సుడిగాలి ఇన్నింగ్ ఆడాడు. స్టేడియంలో సునామీ సృష్టించాడు. 96 బంతుల్లో 123 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.












Click it and Unblock the Notifications