రోహిత్ సేన కీలక మ్యాచ్: ప్లేయింగ్ 11 ఇదే: బెజవాడ కుర్రాడిపై ఫోకస్
తిరువనంతపురం: ఐసీసీ ప్రపంచకప్ 2023 టోర్నమెంట్ ఫీవర్ ఆరంభమైంది. ప్రస్తుతం వామప్స్ రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ నెల 5వ తేదీ నుంచి అసలు సిసలు మ్యాచ్‌లు మొదలు కానున్నాయి. గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం దీనికి వేదికగా తొలి మ్యాచ్ షెడ్యూల్ అయింది.
2019 ప్రపంచకప్ ఫైనల్స్‌లో హోరాహోరీగా తలపడ్డ ఇంగ్లాండ్- న్యూజిలాండ్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ కూడా కలుపుకొంటే మొత్తం 48 మ్యాచ్‌లు ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నాయి. నవంబర్ 12వ తేదీన భారత్- నెదర్లాండ్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో లీగ్ దశ ముగుస్తుంది. అదే నెల 15, 16 తేదీల్లో సెమీ ఫైనల్స్ ఉంటాయి. 19వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

ఈ నెల అక్టోబర్ 8వ తేదీన టీమిండియా తన తొలి మ్యాచ్‌ను ఆడబోతోంది. ఆస్ట్రేలియాతో తలపడుతుంది. మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించడం భారత్‌కు ఉన్న ప్లస్ పాయింట్. చివరి మ్యాచ్ ఓడినప్పటికీ సిరీస్‌ను సొంతం చేసుకోగలిగింది. అదే ఊపును వరల్డ్ కప్‌లో కొనసాగించడానికి ఉవ్విళ్లూరుతోంది టీమిండియా.
ఆస్ట్రేలియాతో మ్యాచ్ తరువాత 11వ తేదీన రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఢీ కొడుతుంది. ఆ తరువాత జరిగే గేమ్‌లో అంటే.. తన మూడో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఎదుర్కోనుంది రోహిత్ సేన. అందరి దృష్టీ ఈ మ్యాచ్ మీదే ఉంది. ప్రపంచకప్ సన్నాహకంలో భాగంగా ప్రస్తుతం వామప్స్ ఆడుతోంది.
నేడు నెదర్లాండ్స్‌ను ఢీ కొట్టబోతోంది. తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం దీనికి వేదిక. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. గువాహటిలో షెడ్యూల్ అయిన తొలి వామప్ రద్దయిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్‌తో తలపడాల్సిన ఈ మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే వర్షార్పణం అయింది. ఇక నెదర్లాండ్స్‌తో తలపడటానికి సిద్ధమైంది.

నెదర్లాండ్స్ తరఫున ఆడనున్న తేజ నిడమానూరు.. తెలుగు క్రికెటర్. అతని స్వస్థలం విజయవాడ. ఆల్‌రౌండర్. ఇదివరకు జింబాబ్వేపై ఆడిన మ్యాచ్‌లో 96 బంతుల్లో 110 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అతని ఇన్నింగ్ లో మూడు భారీ సిక్సర్లు ఉన్నాయి. తొమ్మిది మెరుపుల్లాంటి ఫోర్లు బాదాడు. కుడిచేతి వాటం ఆఫ్ బ్రేక్ బౌలర్ కూడా.
ఈ మ్యాచ్ తుదిజట్టులో- రోహిత్ శర్మ (కేప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కేప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ఆడే అవకాశం ఉంది.
నెదర్లాండ్స్ ప్లేయింగ్11లో- స్కాట్ ఎడ్వర్డ్స్ (కేప్టెన్), మాక్స్ ఓ'డౌడ్, బాస్ డీ లీడ్, విక్రమ్ సింగ్, తేజ నిడమానూరు, పాల్ వాన్ మీకెరెన్, కోలిన్ అకెర్‌మాన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వ్, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, ర్యాన్ క్లైన్, వెస్లీ బరేసి, సకిబ్ జుల్ఫిక్, షరీజ్ అహ్మద్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ ఆడొచ్చు.












Click it and Unblock the Notifications