భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌కు మెగా ఈవెంట్: ఆ లోటు భర్తీ..!!
హైదరాబాద్: వరల్డ్ కప్ 2023లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో పాకిస్తాన్ తన రెండో మ్యాచ్‌లో అదరగొట్టింది. శ్రీలంకను చిత్తు చేసింది. ఆ జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నామనే సందేశాన్ని పంపించింది. వరుసగా రెండో మ్యాచ్‌లో విజయదుందుభి మోగించింది. భారత్‌తో మ్యాచ్‌కు ముందు బూస్ట్ లాంటి సక్సెస్‌ను అందుకుంది బాబర్ ఆజమ్ సేన.
ఇదే హైదరాబాద్ ఉప్పల్ పిచ్‌పై ఇదివరకు నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయ కేతనాన్ని ఎగురవేసిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 286 పరుగులు చేసింది. 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు తడబడింది. 41 ఓవర్లల్లో 205 పరుగులకు ఆలౌట్ అయింది.

రెండో మ్యాచ్‌లో శ్రీలంకకు చుక్కలు చూపింది. శ్రీలంక నిర్దేశించిన 344 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా కొట్టి పడేసింది పాకిస్తాన్. నాలుగు వికెట్ల నష్టానికి 345 పరుగులతో ఘన విజయం సాధించింది. ఇంకా 10 బంతులు మిగిలి ఉండగానే భారీ లక్ష్యాన్ని ఛేదించిందంటే ఆ జట్టు దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
పాకిస్తాన్ బ్యాటర్ల సత్తాకు అద్దం పట్టిన మ్యాచ్ అది. ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు నమోదు చేశారు. ఓపెనర్ అబ్దుల్ షఫిక్- 113, మిడిలార్డర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్- 131 పరుగులతో హోరెత్తించారు. మరోసారి కేప్టెన్ బాబర్ ఆజమ్ విఫలం కావడం పాకిస్తాన్‌ను ఆందోళనకు గురి చేస్తోన్నప్పటికీ.. లోయర్ ఆర్డర్ వరకూ బ్యాటర్లు పరుగులు సాధిస్తోండటం ఊరట కలిగిస్తోంది.
ఇప్పుడు భారత్‌ను ఢీ కొట్టడానికి సిద్ధపడుతోంది. ఈ నెల 14వ తేదీన గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు మొదలవుతుంది. రోహిత్ సేన కూడా ఈ మ్యాచ్ కోసం పూర్తి సన్నద్ధమైంది. ఇవ్వాళ ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌ను ప్రాక్టీస్‌గా తీసుకోవచ్చు.
భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌ను గ్రాండ్‌గా ఆరంభించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మెగా టోర్నమెంట్‌ను ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండానే ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ లోటును భర్తీ చేసేలా గ్రాండ్ ఈవెంట్‌ను కలర్‌ఫుల్‌గా నిర్వహించనుంది బీసీసీఐ.
ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, సౌతిండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్, బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండుల్కర్.. ఈ గ్రాండ్ గాళా ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరు కానున్నారు. ఇలాంటి ఓ కార్యక్రమానికి వారిద్దరూ అటెండ్ కాబోతోండటం ఇదే తొలిసారి. టాప్ ప్లేబ్యాక్ సింగర్ ఆర్జిత్ సింగ్ సైతం ఈ ప్రోగ్రామ్‌లో పెర్‌ఫార్మ్ చేయనున్నాడు.












Click it and Unblock the Notifications